తన వాగ్ధాటితో కోట్లాది మందిని అలరించే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, మరోసారి తన మాటలతో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన విమర్శించిన తీరు అమానవీయంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పసిపిల్లలను “శోభనపు పెళ్ళికొడుకుల”తో పోల్చడం అగ్నికి ఆజ్యం పోసింది.
తాజా వివాదం వివరాల్లోకి వెళితే… పిల్లలకు పుస్తకాలు, బట్టలు, భోజనం అన్నీ ఉచితంగా ఇస్తుంటే వారికి చదువుపై శ్రద్ధ ఉండదని, అన్నీ వారే సమకూర్చుకుంటేనే బాధ్యత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం మానేసి, ప్రభుత్వం ఇచ్చే కోడిగుడ్ల లెక్కలు చూసుకోవడానికే సమయం సరిపోతోందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో పాఠశాలలకు వచ్చే విద్యార్థులను ఆయన శోభనపు పెళ్లికొడుకులతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.
సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు గరికపాటిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. “కనీసం ఒక పూట తిండి దొరుకుతుందనే ఆశతో బడికి వచ్చే నిరుపేద చిన్నారులు లక్షల మంది ఉన్నారు. వారి ఆకలిని కించపరచడం తగునా?” అని పలువురు ప్రశ్నిస్తున్నారు. డ్రాపౌట్స్ (చదువు మానేసేవారు) తగ్గించడానికి, పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడిన విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అపహాస్యం చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మండిపడుతున్నారు. ఒక పండితుడి హోదాలో ఉండి, చిన్నారుల పట్ల అంతటి అసభ్యకరమైన పోలికను వాడటం సంస్కారం అనిపించుకోదని పలువురు అభిప్రాయపడుతున్నారు.