అంతర్జాతీయం

విదేశీ జోక్యం వద్దు.. భారత్‌కు ఇరాన్ కీలక ప్రతిపాదన…

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నౌకాయాన మార్గాలను సురక్షితంగా, తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. శనివారం ఆయన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. హ‌ర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో ప్రపంచ ఇంధన సరఫరా గొలుసుకు తీవ్ర అంతరాయం కలుగుతున్న తరుణంలో ఈ సంభాషణకు ప్రాధాన్యత ఏర్పడింది.

పండుగ సీజన్ పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత, శ్రేయస్సును తీసుకురావాలని ఆశిస్తున్నట్లు ఈద్, నౌరోజ్ శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ అన్నారు. “ఈ ప్రాంతంలో కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ఖండిస్తున్నాను. ఇవి ప్రాంతీయ సుస్థిరతకు ముప్పు కలిగించడమే కాకుండా ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తాయి. నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం, షిప్పింగ్ మార్గాలను సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం” అని మోదీ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇరాన్‌లోని భారత పౌరుల భద్రతకు ఆ దేశం అందిస్తున్న మద్దతును ప్రశంసించారు. గత పది రోజుల్లో మోదీ, పెజెష్కియాన్ మధ్య ఇది రెండో ఫోన్ సంభాషణ కావడం గమనార్హం. 

ఈ చర్చల సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒక కీలక ప్రతిపాదన చేశారు. విదేశీ జోక్యం లేకుండా పశ్చిమాసియా దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా శాంతి, సుస్థిరతలను సాధించవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న భారత్, తన “స్వతంత్ర హోదా”ను ఉపయోగించి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరారు. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా నిరోధించేందుకే సైనిక చర్యలు తీసుకుంటున్నామన్న అమెరికా వాదనలను ఆయన తోసిపుచ్చారు. దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అణ్వాయుధాలను తీవ్రంగా వ్యతిరేకించారని, వాటి తయారీకి వ్యతిరేకంగా మతపరమైన, పరిపాలనాపరమైన ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు.

మరోవైపు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో మాట్లాడి పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. హ‌ర్మూజ్ జలసంధి దిగ్బంధనంతో ప్రపంచ చమురు, ఎల్ఎన్‌జీలో దాదాపు 20 శాతం రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగాయి. ఈ సంక్షోభాన్ని చల్లార్చేందుకు ప్రధాని మోదీ ఒమన్, జోర్డాన్, ఫ్రాన్స్, మలేషియా అధినేతలతోనూ చర్చలు జరుపుతున్నారు.

Related posts

వావ్ భారత్ …ప్రపంచ నాల్గవ ఆర్థిక వ్యవస్థగా అవతరణ….

Ram Narayana

విడిపోయిన సానియా మీర్జా, షోయబ్ మాలిక్.. పాక్ నటిని పెళ్లాడిన షోయబ్!

Ram Narayana

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారీ షాక్ ఇచ్చిన ఢాకా కోర్టు!

Ram Narayana