తెలుగు రాష్ట్రాలు

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత.. నాదెండ్ల రాజకీయ ప్రస్థానం ఇదే!

  • అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో నాదెండ్ల కన్నుమూత
  • హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూత
  • రేపు సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు
  • 1984లో నెల రోజుల పాటు సీఎంగా ఉన్న నాదెండ్ల
  • నాదెండ్ల వయసు 90 సంవత్సరాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నాదెండ్ల… కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడే ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. 

ఆయన అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశానవాటికలో రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నాదెండ్ల మృతి పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

1935 జూన్ 23న గుంటూరు జిల్లాలో నాదెండ్ల భాస్కరరావు జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన… 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన సమయంలో ఆ పార్టీలో చేరారు. 1984లో చికిత్స కోసం ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో… కొంత మంది ఎమ్మెల్యేల మద్దతులో నాదెండ్ల సీఎం అయ్యారు. నెల రోజుల పాటు సీఎంగా ఉన్న నాదెండ్ల… ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

1989లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, ఎన్టీఆర్ హయాంలో నాదెండ్ల మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు.

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల చంద్రబాబు సంతాపం

Chandrababu Expresses Condolences Over Nadendla Bhaskara Rao Death
  • నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి
  • కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసిన చంద్రబాబు
  • ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన భాస్కరరావు

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం తెలియజేశారు. నాదెండ్ల భాస్కరరావు తనయుడు, కేబినెట్ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ముఖ్యమంత్రి ఫోన్ చేసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

నాదెండ్ల భాస్కరరావు మరణం రాష్ట్రానికి తీరని లోటు: జగన్

Jagan pays condolences for Nadendla Bhaskar Rao
  • నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల సంతాపం తెలిపిన జగన్
  • ఏపీ రాజకీయాల్లో నాదెండ్లది విశిష్ట స్థానమని కితాబు
  • ఆయన రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శమని వ్యాఖ్య

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఈ రోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ… నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఏపీ రాజకీయాల్లో నాదెండ్ల భాస్కరరావు విశిష్ట స్థానం సంపాదించారని అన్నారు. ప్రజాసేవలో ఆయన నిబద్ధత, రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శమని చెప్పారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

భూసేకరణ తొందరగా జరిపితే వరంగల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం తొందరగా పూర్తీ ..కేంద్రమంత్రి

Ram Narayana

ఏపీ ప్రాజెక్టును అడ్డుకోండి.. మా వాటికి అనుమతులివ్వండి: తెలంగాణ

Ram Narayana

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు… ఆ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం: టీజీఆర్టీసీ

Ram Narayana