- కేరళలో యూడీఎఫ్ విజయం
- సీఎం రేసులో రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్
- కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ఘనవిజయం సాధించడంతో, తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు రేసులో ఉండటంతో హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ముగ్గురు నేతలూ నాయర్ సామాజిక వర్గానికి చెందిన వారే.
సీఎం రేసులో ఉన్న ముగ్గురు నేతలు:రమేశ్ చెన్నితాల (69): సీనియర్ నేత, మాజీ హోం మంత్రి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, కూటమి పార్టీల మద్దతు, సామాజిక వర్గంలో పట్టు.
కేసీ వేణుగోపాల్ (63): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, పార్టీని సమన్వయ పరచడంలో దిట్ట.
వీడీ సతీశన్ (62): ప్రతిపక్ష నేత. పినరయి విజయన్ను దీటుగా ఎదుర్కొన్న వ్యక్తి, యువతలో మంచి క్రేజ్.
కేరళలో వామపక్ష పాలనకు తెర.. కాంగ్రెస్ కూటమి ఘన విజయం

- కేరళలో పదేళ్ల వామపక్ష పాలనకు ముగింపు
- కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన మెజారిటీ
- దేశంలో కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చివరి రాష్ట్రం కూడా పరాజయం
- ప్రభుత్వ వ్యతిరేకతే ఎల్డీఎఫ్ ఓటమికి కారణమని విశ్లేషణ
- కొన్ని కీలక స్థానాల్లో గెలిచి ఉనికి చాటుకున్న బీజేపీ
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల వామపక్ష పాలనకు తెరపడింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) చారిత్రాత్మక విజయం సాధించింది. పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వంపై ప్రజలు స్పష్టమైన వ్యతిరేక తీర్పు ఇచ్చారు. ఈ ఫలితంతో దేశంలో కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చివరి రాష్ట్రం కూడా వారి చేజారినట్లయింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ప్రభుత్వం ఏర్పాటుకు 71 సీట్లు అవసరం కాగా, యూడీఎఫ్ కూటమి 102 స్థానాలతో తిరుగులేని విజయం అందుకుంది. మరోవైపు, అధికార ఎల్డీఎఫ్ కూటమి 35 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎన్డీయే కూటమి 3 చోట్ల గెలిచి ఉనికిని చాటుకుంది. ఏప్రిల్ 9న ఎన్నికలు జరగగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలే ఎల్డీఎఫ్ ఓటమికి ప్రధాన కారణాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ విజయంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. ఎల్డీఎఫ్ ప్రభుత్వ అహంకారం, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు ఇదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. తాము ఊహించిన దానికంటే గొప్ప విజయం లభించిందని అన్నారు. ఫలితాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు యూడీఎఫ్ సన్నాహాలు చేస్తోంది.
కేరళలో కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ రెడ్డి పాత్ర: తెలంగాణ కాంగ్రెస్ నేత
- కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయన్న అద్దంకి దయాకర్
- కేరళ అభివృద్ధిపై విజయన్ను నిలదీసినట్లు వెల్లడి
- తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేశారని వెల్లడి
కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ప్రభుత్వం ఏర్పాటుకు 71 సీట్లు అవసరం కాగా, యూడీఎఫ్ కూటమి 100కి పైగా స్థానాల్లో గెలుపొందింది. మరోవైపు, అధికార ఎల్డీఎఫ్ కూటమి ఇప్పటిదాకా 33 స్థానాల్లో గెలుపొందింది.
కేరళ ఫలితాలపై అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, యూడీఎఫ్ విజయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్‌పై రేవంత్ రెడ్డి నేరుగా విమర్శలు చేశారని గుర్తు చేశారు. కేరళ అభివృద్ధిపై విజయన్ను నిలదీయడంతో పాటు లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు. అదే సమయంలో తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేరళ ప్రచారంలో ముఖ్యమంత్రి వివరించారని గుర్తు చేశారు.
కేరళ క్యాబినెట్లో 13 మంది మంత్రుల ఓటమి… ధర్మదంలో గట్టెక్కిన సీఎం విజయన్

- కేరళలో అధికార లెఫ్ట్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ
- పోటీ చేసిన 20 మందిలో 13 మంది మంత్రులు ఓటమి
- గెలిచినప్పటికీ సీఎం పినరయి విజయన్ మెజారిటీ భారీగా పతనం
- కొద్దిమంది మంత్రులు మాత్రమే తమ సీట్లను నిలబెట్టుకోగలిగారు
- యూడీఎఫ్ 102 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనం
కేరళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార లెఫ్ట్ కూటమికి ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని క్యాబినెట్లో మెజారిటీ మంత్రులు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమికి తీవ్ర భంగపాటు ఎదురైంది. పినరయి క్యాబినెట్‌లోని 21 మంది మంత్రులకు గాను 20 మంది పోటీ చేయగా, వారిలో ఏకంగా 13 మంది ఓటమి పాలయ్యారు.
తుది ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, యూడీఎఫ్ 102 స్థానాల్లో, లెఫ్ట్ కూటమి 35, ఎన్డీయే 3 స్థానాల్లో విజయం సాధించాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదం స్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, ఆయన ప్రజాదరణ తగ్గినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 2021లో 50,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన ఆయన, ఈసారి ఆరో రౌండ్ లెక్కింపు వరకు వెనుకంజలో ఉన్నారు. చివరికి కేవలం 19,400 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కారు.
గెలిచిన మంత్రుల్లో ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్, పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్ రియాస్, మత్స్యశాఖ మంత్రి సాజి చెరియన్ (సీపీఎం) ఉన్నారు. వీరితో పాటు రెవెన్యూ మంత్రి కే. రాజన్, ఆహార శాఖ మంత్రి జీఆర్ అనిల్, వ్యవసాయ మంత్రి పీపీ ప్రసాద్ (సీపీఐ) కూడా తమ సీట్లను నిలబెట్టుకున్నారు.
అయితే ఓటమి పాలైన వారిలో వీణా జార్జ్, వీఎన్ వాసవన్, ఎంబీ రాజేశ్, వీ శివన్కుట్టి వంటి కీలక సీపీఎం మంత్రులు ఉండటం గమనార్హం. మిత్రపక్షాలకు చెందిన మంత్రులు సైతం ఓటమిని చవిచూశారు. ఈ ఫలితాలు అధికార ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.