Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ లో మంత్రి వ్యాఖ్యలపై దుమారం…

ఏపీ లో మంత్రి వ్యాఖ్యలపై దుమారం…
-ఆసుపత్రి లో వైద్యులపై మంత్రి ఆవేశం
-కంట తడి పెట్టిన లేడీ డాక్టర్ సుకన్య
– సర్వీస్ చేస్తున్నా మంత్రి చర్యలు ఆదేశించడం పై వైద్య సిబ్బంది ఆవేదన
-తమను సస్పెండ్ చేసిన అభ్యంతరం లేదన్న వైద్యులు
ఏపీ లో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది .పార్టీ కార్యకర్తలకు వైద్య సహాయం అందే విషయంలో పెనుగొండ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి అక్కడ వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా అక్కడ ఉన్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని మంత్రి డి సి హెచ్ ను ఆదేశించారు. దీనితో మంత్రి మాటలపై సిబ్బంది మనస్తాపానికి గురైయ్యారు .
మంత్రి శంకర్ నారాయణ కఠినంగా మాట్లాడిన తీరుకు అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సుకన్య కంటతడి పెట్టారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సిబ్బంది కొరత ఉన్నా.. నాణ్యమైన సేవలతో రాష్ట్రంలోనే మంచి ర్యాంకు సాధించిన తమపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే తమపై సస్పెన్షన్‌ వేటు వేయాలని.. దేనికైనా తాము సిద్ధమేనని తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే..
ఆదివారం రాత్రి సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో నీళ్ల సమస్యతో ఇరుగు పొరుగు వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన వెంకటేశ్, తరుణ్ గాయపడ్డారు. వీరు అదే రాత్రి 11.30 గంటలకు పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వీరిని పరామర్శించేందుకు మంత్రి శంకర్ నారాయణ సోమవారం ఆసుపత్రికి  వెళ్లారు. ఈ క్రమంలో వైద్యుల విధులు, ఆసుపత్రి సౌకర్యాలపై ఆరా తీశారు. అక్కడున్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు సకాలంలో స్పందించడం లేదని, ప్రైవేటు క్లినిక్‌లు నడుపుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వెంటనే వారికి మెమోలు జారీ చేయాలంటూ వైద్యశాఖ ఉన్నతాధికారులను ఫోన్‌లోనే ఆదేశించారు. అవసరమైతే సస్పెండ్ చేయాలని డీసీఎస్‌హెచ్ రమేశ్ నాథ్‌కు సూచించారు. దీంతో మంత్రి ఆరోపణలతో తీవ్ర ఆవేదనకు గురైన వైద్యురాలు సుకన్య ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. నిజాయతీగా పని చేస్తున్న తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుని మంత్రి మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మంత్రి శంకర్ నారాయణ వ్యాఖ్యలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బుడం సాహెబ్ స్పందించారు. ఆరు మంది సిబ్బంది ఉండాల్సిన చోట ఇద్దరు వైద్యులు 24 గంటలు పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను సస్పెండ్‌ చేసినా సిద్ధంగానే ఉన్నామన్నారు. ర్యాంకింగుల్లో ఎక్కడో ఉన్న తమ ఆసుపత్రిని.. ఉన్నత స్థానంలో నిలబెట్టామని తెలిపారు. అవసరమైతే.. రికార్డులు పరిశీలించాలన్నారు. ఎనిమిది గంటలు విధుల్లో ఉండాల్సిన తాము.. సిబ్బంది కొరత కారణంగా 24 గంటలు పని చేస్తున్నామని వాపోయారు. ఇక్కడున్న సౌకర్యాలపై పై అధికారులకు నివేదిక పంపామని.. త్వరలోనే అన్నీ సమకూరనున్నాయన్నారు.

Related posts

సముద్రంలో మునిగిన పడవ, 37 మంది వలసదారుల గల్లంతు…

Drukpadam

5 హామీలిచ్చాం.. 2 గంటల్లో అమలు చేస్తాం: రాహుల్ గాంధీ

Drukpadam

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటన..!

Drukpadam

Leave a Comment