Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

రాజశేఖరరెడ్డి బతికున్నా కూడా…: రాష్ట్ర విభజనపై కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు!

  • రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదనే తీర్మానాన్ని వైఎస్ హయాంలోనే పెట్టామన్న కిరణ్ కుమార్ రెడ్డి
  • వైఎస్ ఉన్నా విభజన ఆగేది కాదని వ్యాఖ్య
  • రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పారని వెల్లడి

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బతికుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగుండేది కాదని… రాష్ట్ర విభజనను ఆయన అడ్డుకుని ఉండేవారని చాలా మంది భావిస్తుంటారు. అయితే, ఈ విషయంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రాజశేఖరరెడ్డి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారని… కానీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదు అనే తీర్మానాన్ని రాజశేఖరరెడ్డి హయాంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం పెట్టించాలని చూసిందని కిరణ్ కుమార్ రెడ్డి సంచలన విషయాన్ని వెల్లడించారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన 2009లోనే జరగాల్సిందని చెప్పారు. 

తాను చీఫ్ విప్ గా ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి పిలిచి… ‘మనం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం’ అనే తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పారని తెలిపారు. ఎన్నికల ముందు మనం ఈ తీర్మానాన్ని పెడితే మనం ఓడిపోతామని ఆయనతో తాను చెప్పానని… ‘నా చేతుల్లో ఏమీ లేదు. రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు’ అని ఆయన తనతో అన్నారని చెప్పారు. దీంతో తాము ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడామని… ‘మేము తెలంగాణకు అనుకూలం’ అనే తీర్మానాన్ని ‘మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు’ అని మార్చి పెట్టామని వెల్లడించారు. 

రాష్ట్ర విభజన జరగదనే తాము అనుకున్నామని… దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ ఉన్నా విభజన ఆగేది కాదని చెప్పారు.

Related posts

లిక్కర్ కిక్కు ….నేడే డ్రా …అదృష్టవంతులేరో ….

Ram Narayana

హనుమకొండలో వింత ఘటన.. 5 గంటలపాటు చెరువులో తేలియాడిన వ్యక్తి!

Ram Narayana

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం!

Ram Narayana

Leave a Comment