- రూ.10 కోసం వాగ్వాదం.. కండక్టర్ దురుసుతనం
- దిగాల్సిన స్టేజీ దాటిపోవడంతో మళ్లీ టికెట్ తీసుకోవాలన్న కండక్టర్
- స్టేజీ వచ్చిందని గుర్తుచేయలేదని వాదించిన వృద్ధుడు
- రాజస్థాన్ లోని జైపూర్ లో ఘటన
రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ వృద్ధుడిపై బస్ కండక్టర్ దాడి చేశాడు. రూ.10 కోసం వృద్ధుడని కూడా చూడకుండా పిడిగుద్దులు గుద్దుతూ, కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా ప్రవర్తించాడు. 75 ఏళ్ల ఆ వృద్ధుడు పదవీ విరమణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ కండక్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వృద్ధుడి ఫిర్యాదుతో ఆ కండక్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వైరల్ వీడియో వెనక..
జైపూర్ కు చెందిన విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఎల్ మీనా శుక్రవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కనోటా స్టేజీ వద్ద ఆయన దిగాల్సి ఉంది. అయితే, కనోటా స్టాప్ వచ్చినపుడు కండక్టర్ ఘన్ శ్యామ్ శర్మ చెప్పకపోవడంతో మీనా ఆ స్టాప్ లో దిగలేదు. దీంతో తర్వాతి స్టాప్ లో దిగి వెనక్కి వెళ్లండంటూ కండక్టర్ చెప్పాడు. రూ.10 ఇచ్చి మళ్లీ టికెట్ తీసుకోవాలని చెప్పాడు. దీనిపై కండక్టర్ తో మీనా గొడవపడ్డారు. బస్సు ఆగిన స్టాప్ పేరును ప్రయాణికులందరికీ వినిపించేలా చెప్పడం కండక్టర్ బాధ్యత అని, అలా చెప్పకపోవడం వల్లే తాను దిగాల్సిన స్టేజీలో దిగలేకపోయానని మీనా వాదించారు.
కండక్టర్ చేసిన తప్పుకు తాను ఎందుకు డబ్బులు చెల్లించాలని ప్రశ్నించాడు. దీంతో విసిగిపోయిన కండక్టర్.. మీనాను వెనక్కి నెట్టాడు. మీనా కోపంతో ఆ కండక్టర్ చెంప పగల కొట్టాడు. దీంతో రెచ్చిపోయిన కండక్టర్.. మీనాపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మీనా వీపుపై కొడుతూ, కాళ్లతో తన్నుతూ దారుణంగా ప్రవర్తించాడు. బస్సులోని ఓ ప్రయాణికుడు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.