బండి సంజయ్ ది ప్రజా సంగ్రామ యాత్ర కాదు ప్రజా వంచన యాత్ర :కేటీఆర్ ఫైర్!
-‘జల దోపిడీకి జై కొడతారా?’.. బండి సంజయ్ పాదయాత్రపై కేటీఆర్ బహిరంగ లేఖ
-ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అన్న కేటీఆర్
-పాలమూరులో అడుగుపెట్టే హక్కు సంజయ్‌కు లేదని వ్యాఖ్య
-కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చలేదని విమర్శ
-పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ యాత్రలు చేస్తారా? అని నిలదీత
బండి సంజయ్ ప్రారంభించిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బండి సంజయ్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆయన చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర కాదు … ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని కేటీఆర్ పేర్కొన్నారు. పాలమూరులో అడుగుపెట్టే హక్కు బండి సంజయ్‌కు లేదని చెప్పారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడీకి జై కొడతారా? అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ యాత్రలు చేస్తారా? అని ఆయన నిలదీశారు. కుట్రలు చేసిన వారు ఇప్పుడు యాత్ర పేరుతో కపట నాటకాలు ఆడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. దానిపై కేంద్ర ప్రభుత్వానికి కక్ష ఎందుకు అని ఆయన నిలదీశారు. బీజేపీకి విభజన హామీలు నెరవేర్చే తెలివి లేదని, నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ నిధులు ఇచ్చే నీతి లేదని అన్నారు. తెలంగాణ అంటే గిట్టని పార్టీ బీజేపీ అని ఆయన విమర్శించారు.