- క్రూరమైన నేరాల్లో మరణశిక్షను విధించేలా చట్టాలను సవరించామన్న మోదీ
- మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్న ప్రధాన మంత్రి
- మహిళలు గ్రామీణ ప్రాంతాల ఆత్మగా అభివర్ణించిన నరేంద్ర మోదీ
తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చిందని, అందుకే అత్యాచారం వంటి క్రూరమైన నేరాల్లో మరణశిక్షను విధించేలా చట్టాలను సవరించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని నవసారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు.
అమ్మాయిలు ఆలస్యంగా ఇంటికి వస్తే తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటారని, కానీ అబ్బాయిల విషయంలోనూ అలాగే ప్రశ్నించాలని వ్యాఖ్యానించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చి, నిబంధనలు, చట్టాలను మార్చామని నరేంద్ర మోదీ అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ఆత్మ గ్రామీణ ప్రాంతాల్లో ఉందని గాంధీ చెప్పారని, మహిళలు మన గ్రామీణ ప్రాంతాలకు ఆత్మగా భావిస్తున్నానని అన్నారు.
ముస్లిం మహిళల జీవితాలను నిలబెట్టేందుకు ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చామని గుర్తు చేశారు. మహిళల సారథ్యంలో ఎన్నో సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయని ఆయన అన్నారు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదం కలిగిన తాను ప్రపంచంలోనే అత్యంత ధనికుడినని వ్యాఖ్యానించారు.
నా సోషల్ మీడియా ఖాతాల నిర్వహణను మహిళలకు అప్పగిస్తా: ప్రధాని మోదీ ప్రకటన

మహిళా విజేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణను మహిళలకే అప్పగిస్తానని ఆయన మరోసారి ప్రకటించారు. నిన్న సూరత్‌లో ఆహార భద్రత ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు.
వివిధ రంగాల్లోని మహిళా విజేతలకు తన వివిధ సోషల్ మీడియా ఖాతాలను ప్రధాని మోదీ అప్పగించడం కొత్తేమీ కాదు. విజేతలైన మహిళలు తమ కృషి, అనుభవం గురించి తన సోషల్ మీడియా ఖాతాల్లో వివరించేందుకు 2020 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడుగురు ప్రముఖ మహిళలకు వాటి నిర్వహణ బాధ్యతలను మోదీ అప్పగించారు. వారిలో ఏపీకి చెందిన కల్పన రమేశ్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్నేహ మోహన్ దాస్, డాక్టర్ మాళవిక, అరిఫా జాన్, విజయ పవార్, కళావతిదేవి, వీణాదేవిలు ఉన్నారు.
ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు. వివిధ రంగాల్లో విజేతలైన మహిళలు తమ సామాజిక సేవ ద్వారా లక్షలాది మందికి ప్రేరణ కలిగించాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ నారీ శక్తికి తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణను అప్పగిస్తున్నారు.
మహిళా దినోత్సవం జరుపుకోవడం సమాజ బాధ్యత : ఏపీ సీఎం చంద్రబాబు

- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని వెల్లడి
- ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో రూ.4,332 కోట్ల కేటాయింపు చేశామన్న సీఎం
మహిళా దినోత్సవం జరుపుకోవడం అనవాయితీ కాదని, ఇది సమాజ బాధ్యత అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, మాతృసమానులైన మహిళామణులకు చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని, మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందేనన్నారు. తాజాగా 2025- 26 వార్షిక బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా రూ.4,332 కోట్లు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
అలాగే ‘దీపం 2’ స్కీమ్ కింద 90.1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్ వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామన్నారు. మహిళాభివృద్దితోనే సమాజాభివృద్ది అని బలంగా నమ్మి పనిచేస్తున్నామని, మహిళ భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారు.
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి: ఏపీ సీఎం చంద్రబాబు…

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, ఇందుకోసం ఎన్డీయే ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ఎలీప్), ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ (ఏపీ) ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం రాత్రి జరిగిన న్యూ జనరేషన్ – టెక్కేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్‌ప్రైజెస్ అంతర్జాతీయ సదస్సులో ఆయన మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
అనకాపల్లి జిల్లా కోడూరులో ఎలీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న హరిత పారిశ్రామిక పార్క్‌కు సంబంధించిన శిలాఫలకాన్ని ఇదే వేదిక పక్కన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలు సంపాదనలో పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తున్నారని అన్నారు. అన్ని రంగాల్లో అపారమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. శ్రామిక శక్తిలో మహిళలు లేకుండా పురోగతి అసాధ్యమని వివరించారు. ప్రపంచ దేశాల్లో కెల్లా భారతదేశంలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని అన్నారు. 30 ఏళ్ల క్రితం వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు.
ఇన్నోవేషన్ హబ్‌ల ద్వారా మద్దతు
రాష్ట్రంలో వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఏ మహిళకైనా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నిర్మాణాత్మకమైన మద్దతును అందిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలను అన్ని రకాలుగా ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని వివరించారు. ఈ విషయం తాను ఇప్పుడు మాట్లాడటం కాదు… రాబోయే రోజుల్లో ఫలితాలను కూడా చూపిస్తానని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మహిళలను ప్రోత్సహించి అద్భుతాలను సృష్టిస్తామని అన్నారు.
ఏఐలోనూ మహిళలు రాణించాలి
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మహిళ కూడా ఏఐలో రాణించాలని, భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దేనని అన్నారు. మీరు ఆఫీసులో పని చేసి ఇంటికి వెళ్లేముందు ప్రోగ్రామ్ చేసుకుని ఇంటికి చేరుకునే సమయానికి ఆహారాన్ని సిద్ధంగా ఉంచుకోవచ్చు. నూతన ఆవిష్కరణలే మన జీవితాలను మార్చుతాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీని ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో విజన్‌ను రూపొందించాం. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిపి 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
డిజిటల్ అక్షరాస్యత అవసరం
“నిరంతర అభ్యాసం ప్రతి ఒక్కరికీ అవసరం. అభ్యాసం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ, తద్వారా అపారమైన జ్ఞానాన్ని పొందగలం. ప్రపంచం వేగంగా మారుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను పెంచుకోవాలి. డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను పొందాలంటే డిజిటల్ అక్షరాస్యత తప్పకుండా అవసరం. పౌరులు టెక్నాలజీతో పాటు సెల్‌ఫోన్‌లను కూడా విరివిగా వినియోగించాలి. ప్రస్తుత కాలంలో భార్య లేకుండా భర్త, భర్త లేకుండా భార్య జీవించగలుగుతున్నారు కానీ సెల్‌ఫోన్ లేకుండా ఏ ఒక్కరూ ఉండలేకపోతున్నారు.
మహిళలు పని, గృహ బాధ్యతలను సమర్ధవంతంగా సమతుల్యం చేసుకోవడానికి వీలుగా రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం విధానాన్ని తీసుకురాబోతున్నాం. మహిళలు నూతన ఆవిష్కరణలను తీసుకురావాలి. మహిళా సాధికారతకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. అవకాశాలను అంచనా వేసుకుని, రాష్ట్ర పురోగతికి సమష్టిగా పనిచేయాలి. రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం. కార్యాచరణ, ఆవిష్కరణల ద్వారా ఏపీని ఎంట్రప్రెన్యూర్‌లకు కేంద్రంగా మార్చేందుకు కృషి చేసి రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించేందుకు అందరం పనిచేద్దాం’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఎలీప్ ప్రెసిడెంట్ రమాదేవి మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు గాడ్ ఫాదర్ అని కొనియాడారు. ఉమ్మడి ఏపీలోని మొదటి పారిశ్రామిక పార్క్ కు ఆయన గాజులరామారంలో శంకుస్థాపన చేశారని, అది ప్రపంచానికే ఆదర్శంగా ఎదిగిందన్నారు. సరైన వసతులు కల్పిస్తే పురుషులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మహిళా పారిశ్రామికవేత్తలు దూసుకెళతారని నిరూపిస్తున్నారని అన్నారు.
ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి ఆఖరు రోజు: చంద్రబాబు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల స్టాల్స్ ను సందర్శించిన అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి ఆఖరు రోజవుతుందని హెచ్చరించారు. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు సంపాదించకపోతే పురుషులు చులకనగా చూస్తారని అన్నారు. ఈ ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారుచేస్తామని చెప్పారు. ఆడబిడ్డలు సంపాదించేందుకే డ్వాక్రా ప్లాట్ ఫామ్ సృష్టించామని వెల్లడించారు.
ఇక, తాను రాజకీయాల్లో ఉండడం వల్ల డబ్బు సంపాదించలేకపోయానని… తన అర్ధాంగి భువనేశ్వరి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారని తెలిపారు. ఇంట్లో నాకు కూడా డబ్బులిచ్చే స్థాయికి భువనేశ్వరి ఎదిగారు అని చంద్రబాబు గర్వంగా చెప్పారు.
పోలీస్ ‘శక్తి’ యాప్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
మార్కాపురం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన ‘శక్తి’ యాప్ ను ఆవిష్కరించారు. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా చేనేత రథాన్ని ప్రారంభించారు. ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా చంద్రబాబు ప్రారంభించారు.
సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: నారా లోకేశ్

- నేడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
- సోషల్ మీడియాలో స్పందించిన నారా లోకేశ్
- మహిళా శక్తి అపారం అంటూ సోషల్ మీడియాలో పోస్టు
- సమాన అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణిస్తారని వెల్లడి
నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నారీ లోకానికి విషెస్ తెలిపారు. సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మహిళా శక్తి అపారం… సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారని కొనియాడారు. “పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాల అండగా నిలుస్తున్నాం. రాష్ట్రంలో మహిళా సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక, ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. తమ తమ రంగాల్లో మహిళలు మరిన్ని విజయాలను సాధిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ లోకేశ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో వందలాది మంది మహిళలతో తీసుకున్న సెల్ఫీని లోకేశ్ పంచుకున్నారు.
ఏపీ డీజీపీ ఆఫీసులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. విజేతలకు డీజీపీ భార్య చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

- మహిళా సాధికారతతోనే సమాజ అభ్యున్నతి సాధ్యమన్న వక్తలు
- విజేతలకు బహుమతులు అందజేసిన డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆర్ధాంగి సీమా గుప్తా
ఏపీ డీజీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆర్ధాంగి సీమా గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వక్తలు వివరించారు.
మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారని, మహిళా సాధికారతతోనే సమాజం అభ్యున్నతి సాధించి, ప్రగతిపథంలో పయనిస్తుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు సీమా గుప్తా చేతులు మీదుగా బహుమతి ప్రదానం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజిపి రాజకుమారి, డిఐజి కమ్యూనికేషన్స్ ఎన్ ఎస్ జే లక్ష్మి, డిసీపీ సరిత, డీజీపీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

- మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుంటాయన్న జగన్
- వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి
- నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చట్టం చేశామన్న జగన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న నానుడి ఉందని అన్నారు.
ఆ నానుడిని నమ్ముతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికారతకు పెద్దపీట వేస్తూ పాలన చేశామని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించామని, నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చట్టం చేశామని వివరించారు.
గిరిజన, దళిత మహిళలను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద పదవులతో గౌరవించామని పేర్కొన్నారు. మహిళల భద్రత, రక్షణ కోసం దిశ వ్యవస్థను ప్రవేశపెట్టామని జగన్ పేర్కొన్నారు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, బాలకృష్ణ

- నేడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
- కుటుంబాలకు, దేశానికి మహిళలు వెన్నెముక వంటి వారన్న పవన్
- యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ బాలయ్య పోస్ట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో మహిళల బలం, సహన శక్తి, భాగస్వామ్యాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం కీర్తిస్తుందని పేర్కొన్నారు.
కుటుంబాలకే కాదు, ఎదుగుతున్న దేశానికి కూడా మహిళలు వెన్నెముక వంటి వారని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ఆమె గొప్పదనాన్ని గుర్తిద్దాం… ఆమెకు మద్దతుగా నిలబడదాం, ఆమె కలలకు చేయూతనిద్దాం… మన చర్యల ద్వారా ఆమెకు నిజమైన గౌరవాన్ని అందిద్దాం అని పిలుపునిచ్చారు.
మరింత మెరుగైన ప్రపంచాన్ని మనకు అందిస్తున్నందుకు మహిళను గౌరవిద్దాం… మరింత ఎత్తుకు తీసుకెళదాం… ఇవాళ ఒక్కరోజే కాదు… ప్రతి రోజూ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
స్త్రీ స్వభావమే ఆది మాతృత్వం: బాలకృష్ణ
యత్రనార్యస్తు పూజ్యంతే… రమంతే తత్ర దేవతాః అని మన సంస్కృతి మనకు చెబుతుందని… ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని దీని అర్థం అని నందమూరి బాలకృష్ణ వివరించారు. స్త్రీ స్వభావమే ఆది మాతృత్వం అని అభివర్ణించారు. కుటుంబాన్ని కాపాడే బలం, సమాజంలో వెలుగులు నింపే శక్తి, భవిష్యత్ పల్లవించే ప్రేమ మహిళల గొప్పదనం అని పేర్కొన్నారు.
“మహిళలు అమ్మగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా ప్రతి రూపంలోనూ త్యాగానికి, ఓర్పుకు, ప్రేమకు మారుపేరుగా నిలుస్తారు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళా స్ఫూర్తిదాయకమే. వారిని గౌరవించుకోవడం మన విధి… వారిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆదరణ, అంకితభావం, అజేయ సంకల్పం గల మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ బాలకృష్ణ సోషల్ మీడియాలో స్పందించారు.
మహిళలు అత్యవసర పరిస్థితిలో 181 టోల్ ఫ్రీ సేవలు వినియోగించుకోవాలి: మంత్రి నాదెండ్ల

- నేడు మహిళా దినోత్సవం
- ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజిలో మహిళా దినోత్సవ వేడుకలు
- హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్
ఏలూరులో సీఆర్ఆర్ కాలేజిలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలకు ఏపీ పౌర సరఫరాలు, ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు.
మహిళల ఆర్థికాభివృద్ధి, భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలు అత్యవసర పరిస్థితిలో 181 టోల్ ఫ్రీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మహిళల భద్రతకు సంబంధించి శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు…. మీ వెంటే మేముంటాం అంటూ మంత్రి భరోసా ఇచ్చారు.
“వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలకు దీపం-2 పధకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం. ఇప్పటికే 96.40 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో నాణ్యమైన బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం. పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే మహిళల అక్రమ రవాణా నిరోధక బిల్లుకు పూర్తిగా మద్దత్తిస్తాం. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతోపాటు మహిళలలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం” అని నాదెండ్ల వివరించారు.
కాగా, ఈ కార్యక్రమంలో తొలుత రూ.131.82 కోట్ల చెక్కును మంత్రి డ్వాక్రా సంఘాల మహిళలకు అందజేశారు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి), నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.