- మయన్మార్‌లో శక్తివంతమైన భూకంపం
- రెండేళ్ల కిందట టర్కీ, సిరియాలోనూ ఇదే తరహాలో భూకంపం వచ్చిందన్న యూఎస్ జీఎస్
- భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉండటంతో తీవ్రత అధికం
మయన్మార్ కేంద్రంగా సంభవించిన శక్తివంతమైన భూకంపం పట్ల అమెరికా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూకంపం తీవ్రత, దాని ప్రభావం రెండేళ్ల క్రితం టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం మాదిరిగానే ఉండవచ్చని వారు అంచనా వేశారు. అధిక జనసాంద్రత కలిగిన మయన్మార్, థాయ్‌లాండ్ ప్రాంతాలలో సంభవించిన ఈ విపత్తును ‘రెడ్ ఈవెంట్’గా పరిగణిస్తున్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, శుక్రవారం ఒక్కరోజే ఆరు భూకంపాలు సంభవించాయి, వీటిలో అత్యంత తీవ్రమైనది 7.7గా, అత్యల్పమైనది 4.3గా నమోదయ్యాయి. దీనిపై అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) సంస్థ స్పందించింది. ఈ భూకంపంలో భారీ ప్రాణనష్టం నమోదు అయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
టర్కీ, సిరియాలో రెండేళ్ల కిందట 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 53 వేల మందికి పైగా మరణించారని వెల్లడించింది. ఇవాళ సంభవించిన భూకంపం 7.7 తీవ్రత కలిగి ఉన్నందున, జన నష్టం కూడా ఆ స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని యూఎస్ జీఎస్ తెలిపింది. భూకంప కేంద్రం కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉండటం వల్ల దాని తీవ్రత ఎక్కువగా ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది.
భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలలో మయన్మార్ ఒకటి అని బ్రిటిష్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్త బ్రియాన్ బాప్టై పేర్కొన్నారు. ఇక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్‌ల మధ్య 1200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. గత వందేళ్లలో మయన్మార్‌లో 6 కంటే ఎక్కువ తీవ్రతతో 14 భూకంపాలు నమోదయ్యాయని ఆయన తెలిపారు.
తీవ్ర విషాదం… భూకంపం తీవ్రతకు కుప్పకూలిన వెయ్యి పడకల ఆసుపత్రి

- మయన్మార్, థాయ్ లాండ్ ను వణికించిన భూకంపం
- మయన్మార్ రాజధానిలో కుప్పకూలిన వెయ్యి పడకల ఆసుపత్రి
- ఇక్కడే అత్యధిక ప్రాణనష్టం ఉంటుందని అంచనా
భారీ భూకంపం మయన్మార్, థాయ్ లాండ్ లను వణికించింది. భూకంప తీవ్రతకు ఎన్నో భవంతులు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో అంచనా వేయలేని పరిస్థితి ఉంది.
మరోవైపు మయన్మార్ రాజధాని నేపిడాలో వెయ్యి పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఎక్కువ ప్రాణ నష్టం, అత్యధికంగా క్షతగాత్రులు ఇక్కడే ఉంటారని భావిస్తున్నారు. ఈ ఆసుపత్రిని కొత్తగా నిర్మించారు. ఇంకా పేరు కూడా పెట్టలేదు. ఆసుపత్రి శిథిలాల్లో తమ ఆత్మీయుల కోసం ఎంతో మంది గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
థాయ్ లాండ్, మయన్మార్ తో పాటు ఇండియా, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం సహా పలు తూర్పు ఆసియా దేశాల్లో ప్రకంపనలు వచ్చాయి. 7.7, 6.4, 4.9 తీవ్రతతో మూడు భూకంపాలు వచ్చాయి.
మయన్మార్ లోని మాండలేలో మసీదు కూలి దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. టవుంగూలో పునరావాస కేంద్రం కుప్పకూలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.
భారీ భూకంపం ధాటికి మయన్మార్ లో 25 మంది మృతి

- మయన్మార్, థాయిలాండ్ లో భారీ భూకంపం
- రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- అంతర్జాతీయ సాయం కోరిన మయన్మార్ సైనిక ప్రభుత్వం
- థాయిలాండ్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
మయన్మార్ దేశం ఇవాళ భారీ భూకంపం దాటికి విలవిల్లాడింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత గరిష్ఠంగా 7.7గా నమోదైంది. భూకంపం ధాటికి మయన్మార్ లో 25 మంది మృతి చెందారు. భారీ భవనాలు నేలమట్టం కాగా, శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. పలువురికి గాయాలయ్యాయి.
అటు, మయన్మార్ రాజధాని నేపిడాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భూ ప్రకంకపనల ప్రభావంతో మాండలే నగరంలో ఐకానిక్ వంతెన కూడా కూలిపోయింది. దేశంలో పలు చోట్ల ఎత్తయిన ప్రార్థనా మందిరాలు, గోపురాలు కూలిపోయాయి. భూకంపం నేపథ్యంలో, మయన్మార్ సైనిక ప్రభుత్వం అంతర్జాతీయ సాయం కోరింది. మానవతా దృక్పథంతో సాయం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది.
బ్యాంకాక్ లో ముగ్గురి మృతి
థాయిలాండ్ లోనూ ఇవాళ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రాజధాని బ్యాంకాక్ లో ఓ భారీ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ భవనం శిథిలాల్లో 80 మంది చిక్కుకున్నట్టు థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. సహాయక సిబ్బంది ఇప్పటివరకు ఏడుగురిని కాపాడారు.
ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన భారత్
థాయిలాండ్ లో భారతీయుల సహాయార్థం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. భూకంపం ప్రభావానికి గురైన భారతీయులు ఈ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని థాయిలాండ్ లోని భారత ఎంబసీ పేర్కొంది. థాయిలాండ్ లోని భారత ఎంబసీ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్: +66 618819218