శ్రీకాంత్ మరణం ప్రజాఉద్యమాలకు తీరనిలోటు …వివిధ పార్టీల నేతల నివాళులు
సీపీఐ (ఎం) అఖిల భారత మహాసభ సైతం నివాళి : తమ్మినేని
మధురై నుంచి ఖమ్మం చేరిన శ్రీకాంత్ భౌతికకాయం
ప్రకాశ్ నగర్ నుంచి బైక్ ర్యాలీగా సీపీఐ (ఎం) జిల్లా కార్యాలయానికి..
పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు..
శ్రీకాంత్ కు నివాళులు అర్పించిన సీపీఐ (ఎం) నేతలు తమ్మినేని, పోతినేని, నున్నా, మచ్చా, ఎంపీ వద్దిరాజు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల, మాజీ ఎమ్మెల్యే సండ్ర, సీపీఐ నేతలు బాగం, దండి, కాంగ్రెస్ నేతలు దుర్గాప్రసాద్, పోట్ల, దయాకర్ రెడ్డి, మాస్ లైన్ నేత గుర్రం, టీడీపీ, ఎన్డీ, వివిధ పార్టీల నేతలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు




సీపీఐ (ఎం) అఖిలభారత 24వ మహాసభల ప్రతినిధిగా మధురై వెళ్లి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ మృతికి పలువురు నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు. మధురై లోని అపోలో ఆసుపత్రిలో ఆదివారం మృతి చెందిన ఆయన భౌతిక కాయాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు ఖమ్మం తీసుకొని వచ్చారు. పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీగా ప్రకాష్ నగర్ నుంచి చర్చి కాంపౌండ్ మీదుగా మమత హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. అక్కడ బాడీ డీకాంపోజ్ కాకుండా రసాయన చర్యలు పూర్తయ్యాక తిరిగి బైక్ ర్యాలీగా సీపీఐ (ఎం) జిల్లా కార్యాలయానికి భౌతికకాయాన్ని తీసుకొని వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు ఓ గంటపాటు భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.

వివిధ పార్టీల నేతలు, పలువురు ప్రముఖులు, సీపీఐ (ఎం) కార్యకర్తలు, శ్రీకాంత్ అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ… ప్రజా ఉద్యమాలకు, సీపీఐ (ఎం) పార్టీకి యర్రా శ్రీకాంత్ మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. సీపీఐ (ఎం) అఖిలభారత 24 మహాసభలతో పాటు పార్టీ కేంద్ర కమిటీ ఆయన మృతికి సంతాపం తెలిపినట్లు పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కమిటీ తరఫున మరోసారి నివాళులర్పిస్తున్నట్లు ప్రకటించారు. సంతాప సభ అనంతరం శ్రీకాంత్ భౌతికకాయాన్ని స్థానిక శ్రీనివాస్ నగర్ లోని తన స్వగృహానికి బైక్ ర్యాలీగా తీసుకొని వెళ్లారు.
- మాకే ధైర్యం చెప్పాడు: పోతినేని సుదర్శన్
మార్చి 31వ తేదీన పార్టీ అఖిలభారత మహాసభలకు ఎంతో ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళాము… అంతలోనే శ్రీకాంత్ అకాల మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు వ్యాఖ్యానించారు. 1వ తేదీన మధురై చేరుకున్నామని తెలిపారు. 2, 3వ తేదీ రాత్రి వాంతులు, విరేచనాలు అయ్యాయని తన రూమ్మేట్ వెంకట్ రాములు ద్వారా తెలిసిందన్నారు. ఆ వెంటనే మధురై లోని అపోలో హాస్పిటల్ కి వెళ్లి ఈసీజీ తీయించామన్నారు. సంబంధిత రిపోర్టును ఖమ్మంలోని ప్రముఖ కార్డియాలజిస్ట్ పొన్నం సుబ్బారావు గారికి వాట్సాప్ ద్వారా పంపించామని తెలిపారు. గతంలోనే శ్రీకాంత్ కు రెండు స్డంట్లు వేశారని, మరోసారి ఇలా జరగటంతో క్యాథ్ ల్యాబ్ లోకి తీసుకెళుతున్నప్పుడు ‘ఏమి కాదు.. ధైర్యంగా ఉండాలని’ చెబుతుంటే… ‘ ఏమి కాదన్నా… నాకు ఇదేం కొత్త కాదుగా.. మీరూ ధైర్యంగా ఉండండి’ అని తిరిగి మాకు ధైర్యం చెప్పారని పోతినేని ఆవేదన వెలిబుచ్చారు. చికిత్సల తర్వాత కొంత కోల్కున్న శ్రీకాంత్ ఆ తర్వాత ఆదివారం మరోసారి స్ట్రోక్ రావడంతో తట్టుకోలేకపోయారని ఆవేదన చెందారు. కార్డియాక్ అరెస్ట్ కావటంతో సీఆర్పీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించలేకపోయామని డాక్టర్లు తెలిపినట్లు పోతినేని చెప్పారు. శ్రీకాంత్ ముగ్గురు కుమారుల్లో ఒకరు అమెరికాలో ఉంటున్న నేపథ్యంలో బుధవారం ఆయనకు తుది వీడ్కోలు పలకనున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- మొదటిసారి డెలిగేట్ తో శ్రీకాంత్ సంతోషం: నున్నా
అఖిలభారత మహాసభలకు మొదటిసారి ప్రతినిధిగా ఎంపిక కావడంపై శ్రీకాంత్ ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చారని… కానీ అవే తన చివరి మహాసభలు అవుతాయని ఊహించలేకపోయామని సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు ఆవేదన వెలిబుచ్చారు. జిల్లా నుంచి తనతో పాటు శ్రీకాంత్, మాచర్ల భారతి అఖిలభారత మహాసభలకు ప్రతినిధులుగా వెళ్లామన్నారు. మహాసభలకు వెళ్లేటప్పుడు పోతినేని తో పాటు తామంతా రైల్లో కలిసి వెళ్లామని, తిరిగి వచ్చేటప్పుడు శ్రీకాంత్ తమతో లేకపోవడం బాధాకరమన్నారు. సమ సమాజం కోసం నిరంతరం తపించిన శ్రీకాంత్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఇప్పుడు తమ ముందున్న కర్తవ్యం అన్నారు. పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున సంతాపం వెలిబుచ్చారు. - కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు: బాగం
కమ్యూనిస్టు ఉద్యమానికి శ్రీకాంత్ మరణం తీరని లోటు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు పేర్కొన్నారు. నవ్వుతూ ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే శ్రీకాంత్ తో తన అనుబంధం 30 ఏళ్లుగా కొనసాగుతుందన్నారు. మార్క్సిస్టు పార్టీకి యర్రా వెంకన్న కాలం నుంచి నేటి వరకు యర్రా కుటుంబం అనుబంధం కొనసాగుతూనే ఉందన్నారు. ఆ కుటుంబం పార్టీకి తో అండ అని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలకు శ్రీకాంత్ మరణం తీరని లోటు అని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ వ్యాఖ్యానించారు. - శ్రీకాంత్ మరణం జీర్ణించుకోలేకపోతున్నాం: రాయల, పోట్ల, పువ్వాళ్ల
శ్రీకాంత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఉద్యమ సమయంలో శ్రీకాంత్తో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. రైతు సమస్యలు, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో శ్రీకాంత్ తో కలిసి పాల్గొన్న సంఘటనలను స్మరించుకున్నారు. - శ్రీకాంత్ మరణం ప్రజలందరికీ తీరని లోటు: ఎంపీ వద్దిరాజు
శ్రీకాంత్ మరణం సీపీఐ (ఎం) కే కాదు ప్రజలందరికీ తీరని లోటని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు. మనోధైర్యం కోల్పోకుండా వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. విద్యార్థి ఉద్యమ కాలం నుంచి శ్రీకాంత్ తో తనకున్న అనుబంధాన్ని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నేత సండ్ర వెంకట వీరయ్య గుర్తు చేసుకున్నారు. - మార్కెట్ లో శ్రీకాంత్ లోటు పూడ్చలేనిది: గుర్రం అచ్చయ్య
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శ్రీకాంత్ లేని లోటు పూడ్చలేనిదని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నేత గుర్రం అచ్చయ్య స్పష్టం చేశారు. రైతులకు, తమకు తీరని నష్టమన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి బాధాకరమని సంతాపం తెలిపారు. వీరితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, టిడిపి జిల్లా నాయకులు కొండ బాల కరుణాకర్, ప్రజా ఫ్రంట్ జిల్లా కార్యదర్శి దేవ రెడ్డి విజయ్, సీపీఐ (,ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు మధు, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వర్లు, బండి రమేష్, వై.విక్రమ్, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, మాదినేని రమేష్, బండి పద్మ, సీనియర్ నాయకులు పి సోమయ్య, అప్రోచ్ సమీనా, ఎం. సుబ్బారావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునేని మధు, ఎస్కే ఖాసీం, గిరి, కోలా లక్ష్మీనారాయణ, సీనియర్ అడ్వకేట్ ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, వివిధ ప్రజా సంఘాల నేతలు సంతాపం తెలిపారు.



