
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు
- ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన సిట్
- అజ్ఞాతం నుంచి ఆడియో సందేశం వెలువరించిన రాజ్ కసిరెడ్డి
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి తాజాగా ఓ ఆడియో సందేశం వెలువరించారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణల పట్ల ఆయన ఈ ఆడియో క్లిప్పింగ్ ద్వారా బదులిచ్చారు. ఏపీ లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్న సిట్ వరుస నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, రాజ్ కసిరెడ్డి అజ్ఞాతం నుంచి ఆడియో సందేశం పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆడియో క్లిప్పింగ్ లో రాజ్ కసిరెడ్డి ఏమన్నారంటే… “లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సిట్ అధికారులు నాకు రెండు సార్లు నోటీసులు పంపారు. నాపై వచ్చిన ఆరోపణల పట్ల నేను న్యాయపరంగా పోరాటం చేస్తున్నా. సిట్ నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. నిర్ణీత సమయం ఇచ్చి నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. న్యాయపరమైన రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ముందస్తు బెయిల్ కోసం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నా.
మద్యం కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదు. న్యాయపోరాటం ముగిశాక మీడియాను పిలిచి విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం చెబుతా” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డి… విజయసాయిని ‘బట్టేబాజ్ మనిషి’ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఒకవైపు వాదనలు విని మీడియాలో వార్తలు ప్రసారం చేయొద్దని, తన వాదన కూడా వినాలని, త్వరలోనే మీడియా ముందుకు వచ్చి విజయసాయి వ్యవహారంతో సహా అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు.
కాగా, సిట్ నోటీసులకు తాను స్పందించానని రాజ్ కసిరెడ్డి వెల్లడించారు. నోటీసులపై తన న్యాయవాదులను సంప్రదించగా, సిట్ మిమ్మల్ని సాక్షిగా పేర్కొంటోందని, అయితే అరెస్ట్ చేసే అవకాశముందని వారు చెప్పారని వివరించారు. తనకు సిట్ రెండుసార్లు నోటీసులు ఇచ్చిందని కసిరెడ్డి ఆడియోలో అంగీకరించారు. మొదటి నోటీసు తాను లేని సమయంలో తన తల్లికి ఇచ్చారని, రెండో నోటీసు మెయిల్ ద్వారా పంపి మరుసటి రోజే విచారణకు రమ్మన్నారని తెలిపారు. విచారణకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తనను ఎందుకు విచారణకు పిలుస్తున్నారో స్పష్టం చేయాలని సిట్ ను కోరినట్లు తెలిపారు.
విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి!

- జగన్ కోటరీ గురించి తీవ్ర విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి
- వైసీపీపై అభియోగాలు మోపేందుకు విజయసాయి చూస్తున్నారన్న సుబ్బారెడ్డి
- వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పింది విజయసాయేనని వ్యాఖ్య
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న హాజరైన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్ కోటరీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోటరీ వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ నుంచి వెళ్లిపోయిన తర్వాత పార్టీపై ఏదోరకంగా అభియోగాలు మోపాలని విజయసాయి చూస్తున్నారని సుబ్బారెడ్డి అన్నారు. ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు చక్రం తిప్పింది విజయసాయేనని… పార్టీలో కోటరీ ఉందో, లేదో ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. కోటరీ నడిపింది ఎవరో ఆయనకు తెలియదా? అని అడిగారు.
వైసీపీలో నెంబర్ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని విజయసాయి అన్నారని… పార్టీలో నెంబర్ 2 అనేదే లేదని నెంబర్ వన్ నుంచి 100 వరకు అన్నీ జగనేనని సుబ్బారెడ్డి చెప్పారు.
వైసీపీ హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదని… తమ పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని విమర్శించారు. లిక్కర్ స్కామ్ అంటూ కొందరిని భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అన్నింటిపైనా న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.