Tuvalu ATM
అంతర్జాతీయం

పసిఫిక్ దీవి తువాలులో తొలి ఏటీఎం కేంద్రం

  • ప్రారంభోత్సవానికి స్వయంగా హాజరైన ప్రధాని ఫెలెటి టెయో
  • ఈ దశాబ్దం చివరి నాటికి దేశం పూర్తిగా సముద్రంలో కలిసే అవకాశం
  • క్రమంగా కనుమరుగవుతున్న ‘డిజిటల్ నేషన్’ దిశగా అడుగులు  
  • సంస్కృతి పరిరక్షణకు డిజిటల్ దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు

పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశం తువాలులో మొట్ట మొదటి ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్) సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాలుకు పసిఫిక్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందించి ఈ ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆ దేశ ప్రధాని ఫెలెటి టెయో స్వయంగా హాజరై, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆస్ట్రేలియా, హవాయి మధ్య ఉన్న తొమ్మిది దీవుల సమూహమే ఈ తువాలు. సుమారు 11,200 మంది జనాభా, కేవలం10 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన ఈ దేశం ప్రపంచం దేశాల్లోనే చిన్నది.  ఇన్నాళ్లకు ఇక్కడ తొలి ఏటీఎం ఏర్పాటు కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు, తువాలు తీవ్రమైన పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా దేశ భూభాగం క్రమంగా కనుమరుగవుతోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని 40 శాతం మేర సముద్రంలో కలిసి పోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ దశాబ్దం చివరి నాటికి దేశం పూర్తిగా నీట మునిగి పోయే ప్రమాదం ఉందని, గ్లోబల్ వార్మింగ్‌కు బలయ్యే తొలి దేశంగా తువాలు నిలవనుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో, తమ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు తువాలు ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు, ‘డిజిటల్ నేషన్’గా మారేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. భౌతికంగా తువాలు కనుమరుగైనా, మెటావర్స్ వంటి అధునాతన సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలను, ప్రజల జీవనశైలిని ప్రపంచ పర్యాటకులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో, దేశంలో తొలి ఏటీఎం ఏర్పాటు కావడం, డిజిటల్ దిశగా పడుతున్న అడుగుల్లో ఒకటిగా భావిస్తున్నారు.

Related posts

‘బాంబ్ సైక్లోన్’ ముంగిట అగ్రరాజ్యం అమెరికా…

Ram Narayana

దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ పేరుతో 55 అంతస్తుల టవర్.. ప్రత్యేకతలివే!

Ram Narayana

ప్రమాదకర జీబీయూ-57 అస్త్రాలతో … ఇరాన్ పై భారీ ఆపరేషన్ కు అమెరికా సై?

Ram Narayana