- తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- మధిర నియోజక వర్గంలో పలు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు

చిట్ట చివరి ఆయకట్టుకు సాగునీరందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి మధిర మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. ఈ సందర్భంగా సిరిపురం గ్రామ శివారులో ఉప ముఖ్యమంత్రిని మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి, దారి వెంట పూలు చల్లుతూ మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. సిరిపురంలో 1240 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ. 6 కోట్ల 85 లక్షలతో చేపట్టిన చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు, రూ.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి, రూ.10 కోట్ల 31 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన మధిర ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ భవన నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే మహాదేవ పురం గ్రామంలో సుమారు 952 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 12 కోట్ల 14 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మహాదేవాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి, రాయపట్నం గ్రామంలో 1079 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన రాయపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు, మధిర మునిసిపాలిటీ 3వ వార్డు, అంబారుపేటలో మధిర నుండి ములుగుమాడు వయా నిదానపురం వరకు ఉన్న రహదారిని 25 కోట్ల అంచనా వ్యయంతో రెండు వరసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి ఖర్చు చేసినప్పటికీ ఆయకట్టు సృష్టించడంలో వైఫల్యం చెందిందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ ఖర్చుతో పనులు చేపట్టి, అధిక ఆయకట్టు సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం సమాంతరంగా చేపడుతుందని అన్నారు. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విద్వంసాన్ని సరి చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా, 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్స్ చార్జిల పెంపు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. కార్పోరేట్ కు దీటుగా మన పిల్లలు చదువుకోవాలని యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని, మొదటి దశలో నిరుపేదలకు మంజూరు చేస్తామని అన్నారు. రైతుల సంక్షేమం దిశగా రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యం పండించిన రైతులకు క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్, రైతు బీమా, ఉచిత విద్యుత్ కు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశామని చెప్పారు. మహిళలను సంపన్నులుగా చేసే దిశగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద వివిధ పనులు చేపట్టామని, ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు, మండలాలలో పెట్రోల్ బంకుల ఏర్పాటు, రైస్ మిల్లులో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఖమ్మం సిఇ ఓ వి. రమేష్ బాబు, విద్యుత్ శాఖ ఎస్ఇ శ్రీనివాసా చారి, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్, ఇర్రిగేషన్ కల్లూరు సర్కిల్ ఎస్ఇ జి.వాసంతి, ఖమ్మం ఆర్డీవో నర్సింహా రావు, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, ఇర్రిగేషన్ మధిర డివిజన్ ఇఇ సి.హెచ్. రామకృష్ణ, మధిర డిఇఇ వి. నాగ బ్రహ్మయ్య, సిరిపురం ఏఇఇ బి.శివ సాగర్ తదితరులు పాల్గొన్నారు.