- జమ్మూకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ సౌదీ పర్యటన అర్ధాంతరంగా ముగింపు
- తిరుగు ప్రయాణంలో పాకిస్థాన్ గగనతలాన్ని వినియోగించని ప్రధాని ప్రత్యేక విమానం
- సౌదీ వెళ్లేటప్పుడు ఇదే మార్గాన్ని ఉపయోగించినట్లు వెల్లడి
- ఢిల్లీ చేరుకున్న వెంటనే అత్యవసర భద్రతా సమీక్ష నిర్వహణ
- ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలేది లేదని ప్రధాని స్పష్టీకరణ
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడి నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని హుటాహుటిన భారత్‌కు తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, సౌదీలోని జెడ్డా నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో ప్రధాని విమానం పాకిస్థాన్ గగనతలాన్ని వినియోగించకుండా అరేబియా సముద్రం మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మంగళవారం సౌదీ అరేబియా వెళ్లేందుకు ఇదే విమానం పాకిస్థాన్ గగనతలం మీదుగానే ప్రయాణించింది. కానీ, పహల్గామ్‌లో ఉగ్రదాడి వార్త తెలిసిన వెంటనే ప్రధాని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో సమయం ఆదా చేయడం, అనుమతుల ప్రక్రియను నివారించడం వంటి కారణాలతో పాటు, తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ గగనతలాన్ని వాడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబాకు చెందిన స్థానిక విభాగం ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి బాధ్యత వహించింది.
ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీలతో అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అనంతరం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం కూడా జరిగింది. దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదంపై పోరాటంలో తమ సంకల్పం మరింత బలపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి… దాయాది పాకిస్థాన్ ఏమందంటే..?

- ఈ ఉగ్రవాద దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదన్న పాక్
- అన్ని రకాల ఉగ్రవాద చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని వెల్లడి
- ఈ మేరకు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటన
- భారత్‌లోని అంతర్గత అశాంతి ఫలితంగానే ఈ దాడి జరిగిందని ఆరోపణ
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది సందర్శకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దాయది పాకిస్థాన్ బుధవారం స్పందించింది. ఈ ఉగ్రవాద దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని పాక్ స్పష్టం చేసింది. అన్ని రకాల ఉగ్రవాద చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా ఆ దేశం పేర్కొంది.
ఈ మేరకు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. తాము అన్ని రకాల ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. భారత్‌లోని అంతర్గత అశాంతి ఫలితంగానే ఈ దాడి జరిగిందని పాక్ రక్షణ మంత్రి ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వంపై నాగాలాండ్ నుంచి కశ్మీర్ వరకు వ్యతిరేకత ఉందని, మణిపూర్‌లో కూడా అల్లర్లు జరుగుతున్నాయని, అక్కడ దేశీయ పరిస్థితులే పహల్గామ్ దాడికి కారణమై ఉంటుందని ఆసిఫ్ చెప్పారు. నాగాలాండ్, మణిపూర్, కశ్మీర్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయని, చాలా మందిని ప్రభుత్వం వేధించడం వల్లే ఇలా జరిగిందన్నారు.
ఉగ్రవాదాన్ని తాము సపోర్టు చేయబోమని, ఉగ్రవాదులు స్థానికులను టార్గెట్ చేయరాదని మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. “మేము ఏ రూపంలోనూ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వము. దీనిపై ఎవరికీ ఎటువంటి సందేహం అక్కర్లేదు” అని ఆయన నొక్కి చెప్పారు. అయితే, దేశీయంగా సవాళ్లను ఎదుర్కొన్నప్పుడల్లా పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకోవడం భారత్ కు పరిపాటిగా మారిందని ఆసిఫ్ ఆరోపించారు.