తెలంగాణ వార్తలు

ఊరికో బస్సు… ఇంటికో దీపం అనే నినాదంతో పని చేస్తున్నాం… డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు

ఊరికో బస్సు… ఇంటికో దీపం అనే నినాదంతో పని చేస్తున్నాం… డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు

*గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ నూతన ఆర్టీసీ రూట్ లను ప్రతిపాదించాలి

*మహిళల ఉచిత బస్సు ప్రయాణం కొరకు ఆర్టీసీకు 6210 కోట్ల చెల్లింపు

ఊరికో బస్సు… ఇంటికో దీపం అనే నినాదంతో పని చేస్తున్నామని డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు అన్నారు.బుధవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మధిర పట్టణంలో 10 కోట్ల రూపాయలతో చేపట్టిన బస్ స్టాండ్ నిర్మాణ పనులకు, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ 1987 లో మొదలైన మధిర డిపో అంచెలంచెలుగా ఎదిగిందని అన్నారు. 1978 లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఊరికి ఒక బస్సు ఇంటికి ఒక దీపం అనే స్లోగన్ తో ప్రభుత్వం ఏర్పాటు జరిగిందని అన్నారు. ఆర్టీసీని ప్రజా ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని, గత పాలకుల వివక్షను అధిగమిస్తూ నేడు ఆర్టీసీ బాగు పడుతుందని అన్నారు. సామాన్యులకు రవాణా సౌకర్యం కల్పించే వేదిక ఆర్టిసి మాత్రమేనని అన్నారు. 10 సంవత్సరాల గత ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని, రవాణా శాఖ మంత్రివర్యులు చేసిన కృషి ఫలితంగా నేడు లాభాల బాట పట్టిందని అన్నారు. *మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఆర్టీసీ బస్సులలో కల్పించామని అన్నారు. ప్రజా ప్రభుత్వం 6210 కోట్ల రూపాయలను మహిళల బదులు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా మధిర పట్టణంలో ఆధునిక వసతులతో బస్టాండ్ నిర్మించేందుకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిన రవాణా శాఖ మంత్రికు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
డీజిల్ తో నడిచే బస్సుల నుంచి ఎలక్ట్రిక్ బస్సులకు క్రమ పద్ధతిలో ప్రభుత్వం మారుతుందని, మహిళా సంఘాల ద్వారా 600 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థకు అద్దెకు అప్పగించి వారి ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు తయారు చేశామని అన్నారు.
మధిర పట్టణంలో భవిష్యత్తులో అవసరమైన నూతన బస్సులను ఇక్కడి డ్వాక్రా సంఘాల ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ నూతన బస్సు రూట్ లను ప్రతిపాదించాలని అన్నారు. ఆర్టీసీ బస్సు స్టాండ్ లలో రూఫ్ టాప్ పై సోలార్ విద్యుత్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మధిర పట్టణంలో బస్టాండ్ రికార్డు సమయంలో పూర్తి చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. కార్యక్రమంలో రవాణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 1987 లో 4 బస్సులతో ప్రారంభమైన మధిర బస్ స్టాండ్ నేడు 70 బస్సుల స్థాయికి చేరిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటలలోగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని అన్నారు. గత పాలకుల హయాంలో నూతన బస్సు కొనకుండా, ఆర్.టి.సి. ఆర్థికంగా చాలా నష్టపోయిందని అన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల బస్సులకు మరోసారి డిమాండ్ పెరిగిందని, నూతన బస్సులు మహిళా సంఘాల ద్వారా కోనుగోలు చేస్తున్నామని అన్నారు. ప్రతి నెల దాదాపు 300 కోట్ల రూపాయలు ఆర్టిసికు మహాలక్ష్మి పథకం క్రింద ప్రభుత్వం చెల్లిస్తున్నదని అన్నారు.ఆర్టీసీలో నూతన బస్సులు కొనుగోలు చేయడమే కాకుండా బస్టాండ్ వంటి సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆర్టిసి కార్మికుల కృషి ఫలితంగా ప్రతిరోజు లక్షల మంది గమ్యస్థానం చేరుకుంటున్నారని, ఖమ్మం జిల్లాలో రోజూ రెండు లక్షలకు పైగా ప్రజలు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నారని, వీరిలో లక్షా 32 వేల మంది మహిళలు ఉంటారని అన్నారు.

గ్రామీణ ప్రజలకు లైఫ్ లైన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని, మధిర పట్టణంలో 10 ప్లాట్ ఫాం, వెయిటింగ్ రూమ్, టాయిలెట్స్ వంటి ఇతర సదుపాయాలతో బస్టాండ్ నిర్మాణం జరుగుతుందని అన్నారు.
అనంతరం డిప్యూటి సీఎం, మంత్రులు బస్సులను ప్రారంభించి ప్రయాణికుల సీట్లలో కూర్చొనీ కొద్ది దూరం ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహరావు, కరీంనగర్ జోన్ టిజిఎస్ ఆర్టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలోమన్, ఆర్టీసీ ఇంజనీరింగ్ అసెట్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెరుకుపల్లి వెంకన్న, ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ అజ్మీరా సరిరాం, ఆర్టీసీ చీఫ్ సివిల్ ఇంజనీర్ జోగు భాస్కర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంచిర్యాలలో విషాదం.. 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య!

Ram Narayana

శతాధిక వృద్ధుడు విద్యావేత్త చుక్క రామయ్య…పలువురి శుభాకాంక్షలు

Ram Narayana

ఒక్కో పరీక్ష ఒక్కో జిల్లాలో.. గురుకుల టీజీటీ పరీక్ష రాసేదెలా?అభ్యర్థుల గగ్గోలు

Ram Narayana