ఘనంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ )ఖమ్మం జిల్లా 4 వ మహాసభలు…
హాజరైన జిల్లా మంత్రులు తుమ్మల ,పొంగులేటి, ఎమ్మెల్యేలు రామదాస్ నాయక్ ,రాగమయి
సభలో పాల్గొన్నవందలాది మంది జర్నలిస్టులు
ఫ్లెక్సీలతో నిండిన సభ ప్రాంగణం శబరీ గార్డెన్
జర్నలిస్టులతో కళకళలాడిన వైరా
వివిధ ప్రాంతాల నుంచి మోటార్ సైకిల్ ర్యాలీలతో తరలివచ్చిన జర్నలిస్టులు
టీయూడబ్ల్యూజే నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఏనుగు వెంకటేశ్వరరావు , మైస పాపారావు,కోశాధికారిగా నాగెళ్ల శివానంద
మరో 31 మందితో కార్యవర్గం, ఆఫీస్ బేరర్ల ఎన్నిక
ఎలక్ట్రినిక్ మీడియా అధ్యక్షులుగా మామిడాల భూపాల్ ..కార్యదర్శిగా రామకృష్ణ,కోశాధికారిగా మహేందర్

టీయూడబ్ల్యూజే ఖమ్మం జిల్లా 4 వ మహాసభలు గురువారం వైరాలోని శబరి గార్డెన్ లో అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా జరిగాయి…నిర్వాహకులు అనుకున్నదానికంటే అధికసంఖ్యలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జర్నలిస్టులు రావడం సంఘంపట్ల వారికున్న విశ్వాసాన్ని తెలియజేసింది …గత 67 సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యల పరిష్కరంలో కీలక భూమికను పోషిస్తూ అండగా ఉంటున్న టీయూడబ్ల్యూజే సభలకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందల సంఖ్యలో తరలిరావడం అతిధులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది … సభలకు జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , సమాచార ,ప్రసారాలు , రెవెన్యూ , గ్రహనిర్మాణ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యేలు రామదాస్ నాయక్ ,డాక్టర్ మట్టా రాగమయి హాజరైయ్యారు .. ఢిల్లీ పర్యటనలో ఉన్నందున తాను రాలేకపోయానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు .. సభకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలనుంచి 600 మంది జర్నలిస్టులు పాల్గొనడం విశేషం..సభాప్రాంగణమంతా ఫ్లెక్సీలతో నిండిపోయింది …ఖమ్మం -రాజమండ్రి ప్రధాన రహదారి పక్కనే సభలు జరుగుతున్నందున అటు వెళుతున్న వాహనదారులు తమ వాహనాలను ఆపి అక్కడ ఏమి జరుగుతుందని అడిగిమరి తెలుసుకున్నారు .. నిర్వహకుల అద్భుత ఏర్పాట్లు చూపరులను కట్టి పడేశాయి …ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సైతం నగరంలో చర్చనీయాంశంగా మారాయి…జిల్లా జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో ఈ సభలు మైలు రాయిగా నిలిచాయి..సభలకు వచ్చిన ఇద్దరు మంత్రులు తుమ్మల , పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ,తమకు అన్ని సందర్భంలో అండగా ఉంటున్న జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పబోమని జర్నలిస్టుల హర్షద్వానాలమధ్య తెలిపారు…వెంటనే సమస్యల పరిష్కరానికి చర్యలు చేపడతామని మాట ఇచ్చారు …ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్ , డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్ని వేళల అందండలుగా ఉంటామని అన్నారు . సత్తుపల్లి నియోజకవర్గంలో తాము ప్రతి సంవత్సరం స్థానిక జర్నలిస్టులకు ఐదు లక్షల రూపాయలు సంక్షేమ నిధికి అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి చెప్పారు ..
..ఉదయం నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి జర్నలిస్టులు మోటార్ సైకిళ్ళు , వాహనాల ద్వారా వైరా పట్టణం చేరుకున్నారు. జర్నలిస్టులతో వైరా కళకళలాండింది …11 గంటలకల్లో మహాసభ హాలు జర్నలిస్టులతో కిక్కిరిసింది …తొలుత 11 .10 గంటలు వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు …యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రారంభ ఉపన్యాసం చేశారు …
జర్నలిస్టులకిచ్చిన మాట తప్పేది లేదు
-TUWJ సభలో మంత్రులు తుమ్మల, పొంగులేటి

ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు తమ పార్టీ ఇచ్చిన మాటను తప్పేది లేదని, టీయూడబ్ల్యూజే కోరుతున్న ఆ మూడు సమస్యలకు వీలైనంత తొందరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు హామీ ఇచ్చారు. గురువారం నాడు వైరాలోని శబరి గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ) ఖమ్మం జిల్లా మహాసభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, ఎన్టిఆర్ ప్రొద్భలంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన తనకు, నాటి నుండి నేటి వరకు జర్నలిస్టులు అందిస్తున్న సహకారం వెలకట్టలేనిదన్నారు. తాను పదవుల్లో ఉన్నా, లేకున్నా జర్నలిస్టులతో మాత్రం కుటుంబ సభ్యుల బంధాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నలభై యేండ్ల తన రాజకీయ జీవితంలో జర్నలిస్టుల కష్టాలను దగ్గరి నుండి పరిశీలిస్తున్నానని, కూటి కోసం కాకుండా సమాజానికి ఏదో మేలు చేయాలనే తపనతో నాడు ఎందరో జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించారని, అయితే గత కొంతకాలంగా ఈ వృత్తిలోకి ప్రవేశిస్తున్న కొందరిలో ఆనాటి అంకితాభావం, చిత్తశుద్ధి కన్పించడం లేదని, వ్యక్తిగత ఎజెండాలతో ఈ వృత్తిని ఎంచుకుంటున్నారని ఆయన విచారం వ్యక్తం చేసారు. ఇవ్వాళ ఈ సభలో సీనియర్ పాత్రికేయులను చూస్తుంటే పాత రోజులు జ్ఞాపకం వస్తున్నట్లు మంత్రి తుమ్మల అన్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రితో చర్చించి జర్నలిస్టుల ప్రధాన సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

TUWJ రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ మాట్లాడుతూ, గత పదేళ్లుగా విస్మరించబడుతున్న జర్నలిస్టుల ప్రధాన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని జర్నలిస్టులు ఆశపడ్డారని, అయితే అధికారాన్ని చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా ఏ ఒక్క సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు. ఏడాదిన్నర పాటు పాత అక్రెడిటేషన్ కార్డులను రెన్యూవల్ చేసుకుంటూ పోవడం సరైంది కాదన్నారు. వెంటనే కొత్త కార్డులను జరీచేయాలనీ కోరారు. డెబ్భై యేండ్ల పోరాట చరిత్ర కలిగివున్న తమ సంఘం లెక్కలేనన్ని ఉద్యమాలు చేసి హక్కులను సాధించుకుంటున్నట్లు విరాహత్ అలీ స్పష్టం చేసారు. తెలంగాణ రాష్ట్రంలో 14000 సభ్యత్వాలతో, అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తూ, దేశంలోనే తమ సంఘం అగ్రగామిగా నిలబడడం ఎంతో గర్వంగా ఉందన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రాంనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తున్నది టీయుడబ్ల్యూజే-ఐజేయు సంఘం మాత్రమేనన్నారు. జర్నలిస్టులకు, మీడియా సంస్థలకు ఎలాంటి కష్టం వచ్చినా నాటి నుండి నేటివరకు తల్లి పాత్ర పోషిస్తున్నది తమ సంఘమే అన్నారు. గత కొన్నేళ్లుగా జర్నలిస్టులు అనుభవిస్తున్న వివిధ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రధానంగా జర్నలిస్టుల మూడు కోరికలను మంత్రికి సభ ముఖంగా వివరించారు …మీరు చేసిన వాగ్దానం నెరవేర్చాలని కోరారు ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిస్కారం అవుతాయని భావించాం కానీ ఇక్కడ ఎదో తేడా కొడుతోంది …కోర్ట్ తీర్పుకు , మిగతా జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయనిపుణులు చెపుతున్న విషయాన్నీ మంత్రి దృష్టికి తెచ్చారు …హెల్త్ కార్డులు అందక అనేక మంది జర్నలిస్టులు మృతి చెందుతున్నారని వారికీ తక్షణం వైద్య సౌకర్యం కల్పించేందుకు పాలసీ తీసుకోని రావాలని కోరారు …అక్రిడేషన్ కార్డులు జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని అన్నారు ..
యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో, సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ రాగమయి, వైరా శాసన సభ్యులు రాందాస్ మారోత్, జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర నాయకులు వేణు, నర్వనేని వెంకట్రావు, రవీంద్ర శేషు, సామినేని మురహరి , జిల్లా నాయకులు జ్యోతి వెంకట్రావు, భూపాల్ , పాపారావు, మురళి, సైదులు, శ్రీనివాస్, జనార్దనాచారి , ఖాదర్ , మహేందర్ ,సత్యనారాయణ , పురుషోత్తం , మేడి రమేష్ ,శ్రీనివాస్ , కళ్యాణ్ ,వేణు గోపాల్ , కొత్తగూడెం నుంచి జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న డి .రామారావు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇమంది ఉదయ్ , ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
