పార్లమంట్ న్యూస్ ...

వాడీవేడిగా ఆపరేషన్ సిందూర్ పై చర్చ… విపక్షాలపై భగ్గుమన్న రాజ్ నాథ్ సింగ్

  • కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాలు 
  • కేంద్రంపై విపక్షాల విమర్శలు 
  • తిప్పికొట్టిన రాజ్ నాథ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’ పై లోక్‌సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపక్ష ఎంపీలు ఈ ఆపరేషన్‌లో భారత సైనికులకు జరిగిన నష్టం గురించి, ఎన్ని భారత విమానాలు కూల్చివేతకు గురయ్యాయి అనే దాని గురించి మాత్రమే ప్రశ్నించారని విమర్శించారు. ఇటువంటి ప్రశ్నలు దేశ ప్రజల మనోభావాలను ఏ మాత్రం ప్రతిబింబించవని సింగ్ అన్నారు.

రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ విజయాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ఒక్క భారతీయ సైనికుడికి కూడా హాని జరగలేదని ఆయన స్పష్టం చేశారు. “భారత సైన్యం ఎన్ని శత్రు విమానాలను కూల్చివేసింది? ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయా?” వంటి ప్రశ్నలు విపక్షం ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఈ వారు ఈ ప్రశ్నలు అడిగితే  తమ వద్ద స్పష్టమైన సమాధానాలు ఉన్నాయని అన్నారు.

జాతీయ భద్రతపై దృష్టి సారించాలని,  సాయుధ దళాల స్థైర్యాన్ని దెబ్బతీయవద్దని ఆయన ప్రతిపక్షానికి సూచించారు. ఆపరేషన్ విజయం గురించి ఇప్పటికే తెలియజేసినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ప్రతిపక్షం ప్రజా సమస్యలకు సంబంధించిన అర్థవంతమైన, బాధ్యతాయుతమైన ప్రశ్నలు అడగడమే వారి పాత్ర అని సింగ్ అన్నారు.

ఆపరేషన్ సిందూర్‌పై అనుమానాలు ఉన్నాయి: లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ

Gaurav Gogoi Questions Operation Sindoor in Lok Sabha

ఆపరేషన్ సిందూర్‌పై అనేక సందేహాలున్నాయని, వాటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ కుట్రలను సాగనివ్వకూడదని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనేక విషయాలు చెప్పారని, కానీ పహల్గామ్‌కు ఉగ్రవాదులు ఎలా రాగలిగారో మాత్రం చెప్పలేదని వ్యాఖ్యానించారు.

పహల్గామ్ వరకు ఉగ్రవాదులు వచ్చి ఎలా దాడి చేయగలిగిందో రాజ్‌నాథ్ చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతిపక్షంగా తాము కొన్ని ప్రశ్నలు వేస్తామని, వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన కోరారు. భారతీయులంతా ఏకతాటిపై ఉండి పాకిస్థాన్ దురుద్దేశాలను సాగనివ్వకూడదని అన్నారు. ఉగ్రవాదులు పారిపోయేలా చేశారా లేదా అనే దానిపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉగ్రదాడిలో చనిపోయిన వ్యక్తి భార్య తన ఆవేదన వ్యక్తం చేస్తూ, తన భర్త మృతదేహంపై రాజకీయాలు జరగవద్దని కోరుకున్నారని గుర్తు చేశారు. మన సమాజం విభేదాలతో విచ్ఛిన్నం కావాలని పాకిస్థాన్ కోరుకుంటోందని, ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని రాహుల్ గాంధీ కూడా చెప్పారని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్‌కు తప్పకుండా బుద్ధి చెప్పాలని అన్నారు.

మారణకాండకు పాల్పడిన తర్వాత ఉగ్రవాదులు కొందరి సహకారంతో పరారయ్యారని గౌరవ్ గొగోయ్ అన్నారు. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన వారి గురించి ప్రభుత్వం వద్ద సమాధానం లేదని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్ ప్రశాంతంగా మారిందని చెప్పినప్పటికీ, ఇంతలోనే ఈ దారుణం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.

Related posts

పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం… !

Ram Narayana

ప్రభుత్వాలు శాశ్వతం కాదు… రాజ్యసభలో కమల్ హాసన్ తొలి ప్రసంగం…

Ram Narayana

సహకార రంగంపై కేంద్రానిది సవతితల్లి ప్రేమ …రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు ధ్వజం

Ram Narayana