ఇసుక ,మట్టి అక్రమ రవాణా నియంత్రణపై చర్యలు …కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
అక్రమ ఇసుక, మట్టి రవాణా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఇసుక వనరులు, ఇతర గనుల వివరాల సర్వే రిపోర్టులు తయారు చేసి అందించాలి
డి.ఎస్.ఆర్. కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
అక్రమ ఇసుక, మట్టి రవాణా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్, తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్
పి. శ్రీనివాస రెడ్డి, డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, సంబంధిత అధికారులతో కలిసి డి.ఎస్.ఆర్. కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలం వారీగా గ్రామీణ ప్రాంతాల పరిసరాలలో అందుబాటులో ఉన్న ఇసుక వనరులు, ఇతర గనుల వివరాలకు సంబంధించిన సర్వే రిపోర్టులు తయారు చేసి పకడ్బందీగా అందించాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణా అంశంలో నియంత్రణ సాధించాలని, పత్రికలలో రెగ్యులర్ గా అక్రమ ఇసుక, మట్టి రవాణాపై వార్తలు వస్తున్నాయని, పెద్దగా స్పందన ఉండటం లేదని, దీనిని వెంటనే సవరించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ఇసుక, మట్టి రవాణా కోసం జారీ చేసిన అనుమతులను సమీక్షించుకొని నిబంధనలు అమలు అవుతున్నాయో లేదో రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కూడా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుతుందని, మనం జారీ చేసిన అనుమతులు మేరకే ఇసుక రవాణా జరిగేలా పర్యవేక్షణ ఉండాలని అన్నారు.
జిల్లాలో అక్రమ ఇసుక, మట్టి రవాణా అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు పెంచాలని అన్నారు. అక్రమాల నియంత్రణకు పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలం పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేసి అధికారులు రిపోర్ట్ అందించాలని కలెక్టర్ ఆదేశించారు.మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడా అక్రమ రవాణా జరగకుండా చూడాలని అన్నారు.
ఈ సమావేశంలో సి.పి.ఓ. ఏ. శ్రీనివాస్, భూగర్భ, గనుల సహాయ సంచాలకులు ఆర్. సాయినాథ్, టి.జి.ఎం.డి.సి. ప్రాజెక్ట్ ఆఫీసర్ శంకర్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.