ఆంధ్రప్రదేశ్

మిథున్ రెడ్డికి భారీ ఊరట… లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు…

  • లిక్కర్ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు
  • 71 రోజులుగా జైల్లో ఉన్న మిథున్ రెడ్డి

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఆయనకు విజయవాడలోని ఏసీబీ కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారంలో రెండు రోజుల పాటు సిట్ విచారణకు హాజరవడంతో పాటు, రెండు షూరిటీలు, రూ. 2 లక్షల పూచికత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 

కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని… సాక్షులను బెదిరించరాదని… సహనిందితులతో కేసు గురించి మాట్లాడరాదని… వాట్సాప్ నెంబరు, ఆధార్, ఈమెయిల్ ఐడీ వివరాలు పోలీసులకు అందించాలని కోర్టు తన షరతుల్లో పేర్కొంది.

లిక్కర్ కేసులో జులై 20న మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత71 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈరోజు ఆయనకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత రేపు ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏ31 ధనుంజయరెడ్డి, ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలు బెయిల్ పొందారు.

రాజమండ్రి జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదల

Mithun Reddy Released From Rajahmundry Jail on Bail
  • ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్
  • 71 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల
  • రూ. 3,200 కోట్ల కుంభకోణంలో ఏ-4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి
  • విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ఊరట
  • మిథున్ రెడ్డితో పాటు మరో ముగ్గురు వైసీపీ నేతలకూ బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ, వైసీపీ నేత మిథున్ రెడ్డికి ఊరట లభించింది. సుమారు 71 రోజుల పాటు జైలులో ఉన్న ఆయన సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు నేడు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిథున్ రెడ్డి విడుదల నేపథ్యంలో జైలు వెలుపల సందడి నెలకొంది. ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జైలు వద్దకు వచ్చి కుమారుడికి స్వాగతం పలికారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 3,200 కోట్లకు పైగా మద్యం కుంభకోణం జరిగిందని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మిథున్ రెడ్డిని ఏ-4 నిందితుడిగా పేర్కొంటూ జూలై 20న అరెస్ట్ చేశారు. షెల్ కంపెనీల ద్వారా భారీ మొత్తంలో ముడుపులు సేకరించి, వాటిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చేరవేశారని ఛార్జ్‌షీట్‌లో అభియోగాలు మోపారు.

అరెస్ట్ అయినప్పటి నుంచి బెయిల్ కోసం మిథున్ రెడ్డి పలుమార్లు ప్రయత్నించారు. మొదట హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు సెప్టెంబర్ 6న ఏసీబీ కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. ఓటు వేసిన అనంతరం ఆయన తిరిగి జైలుకు వెళ్లారు. ఇటీవల సెప్టెంబర్ 19న సిట్ అధికారులు ఆయనను విజయవాడ కార్యాలయంలో విచారించారు.

ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కె. ధనుంజయ్ రెడ్డి, పి. కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజి గోవిందప్పకు కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. ఈ స్కామ్‌పై ఏసీబీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేస్తోంది. 

Related posts

అమెరికాపై ‘మంచు బాంబ్’.. బాంబ్ సైక్లోన్ తో గజగజ!

Drukpadam

కర్ణాటకలో బంగారు గొలుసు మింగేసిన ఆవు… శస్త్రచికిత్స చేయించిన యజమాని!

Drukpadam

టీటీడీ ‘ప్రత్యేక ఆహ్వానితులకు’ హైకోర్ట్ బ్రేక్

Drukpadam