- బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం
- వాయుగుండంగా బలపడే అవకాశం
- మంగళవారం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే సూచన
- కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక
- లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల సంస్థ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమమధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న అల్పపీడనం, మంగళవారం మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఏపీఎస్డీఎంఏ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా, నదులు, వాగుల సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: