Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు

  • ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలున్నా స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులే!
  • పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణ దిశగా రేవంత్ సర్కారు
  • ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణకు ఆమోదం
  • త్వరలో అమలులోకి రానున్న కొత్త విధానం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ నిబంధన వల్ల ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉన్న అనేక మంది ఆశావహులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఈ నిబంధనను తొలగించాలని తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని వేగంగా అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది.

ఈ ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018తో పాటు, మున్సిపల్ చట్టాల్లోనూ అవసరమైన సవరణలు చేయనున్నారు. ముఖ్యంగా, పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)ను పూర్తిగా తొలగించాలని కేబినెట్ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని, మరింత మందికి ప్రజాప్రతినిధులుగా పనిచేసే అవకాశం కల్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ సవరణలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

 స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం అప్ డేట్

  • స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు తర్వాతే ప్రభుత్వ నిర్ణయం
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మంత్రి పొంగులేటి స్పష్టీకరణ
  • వచ్చే నెల 7న మరోసారి కేబినెట్ భేటీ

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నొక్కిచెప్పారు. ఈ అంశంపై నవంబర్ 3న హైకోర్టులో విచారణ జరగనుందని తెలిపారు. “ఉన్నత న్యాయస్థానం నుంచి తీర్పు రాగానే, కేబినెట్‌లో చర్చించి స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ క్రమంలో నవంబర్ 7న మరోసారి కేబినెట్ సమావేశం అవుతుంది” అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.

ఈ సమావేశంలో కేవలం ఎన్నికల అంశమే కాకుండా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో పాటు, 1500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాతబడిన రామగుండం థర్మల్ ప్లాంట్‌ను కూల్చివేయాలని కూడా నిర్ణయించింది.

నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల సమస్యపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని విమర్శించారు. శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు 44 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. “ఈ టన్నెల్ నిర్మాణాన్ని పాత పద్ధతిలో కాకుండా, ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించాం” అని ఆయన పేర్కొన్నారు.

Related posts

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త, తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం

Ram Narayana

టాప్ క్యాబ్ చైర్మన్, వైస్ చైర్మన్ లు రాజీనామా…

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ‘రాధాకిషన్‌రావు బ్యాచ్’ దారుణం మరోటి వెలుగులోకి..!

Ram Narayana

Leave a Comment