Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

మా జోలికొస్తే ఊరుకోం: అమెరికాకు పుతిన్ తీవ్ర హెచ్చరిక!

  • రష్యా ఆయిల్ కంపెనీలపై అమెరికా కొత్త ఆంక్షలు
  • ఆర్థికంగా పెద్ద ప్రభావం ఉండదన్న పుతిన్
  • ఇది స్నేహపూర్వక చర్య కాదంటూ వ్యాఖ్య
  • చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టీకరణ 
  • క్షిపణులతో దాడి చేస్తే మాత్రం తీవ్రంగా బదులిస్తామని హెచ్చరిక

తమపై అమెరికా విధించిన కొత్త ఆంక్షలను ఒకవైపు తేలిగ్గా తీసుకుంటూనే, మరోవైపు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆంక్షల వల్ల తమ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండదని స్పష్టం చేసిన ఆయన, ఒకవేళ తమపై క్షిపణులతో దాడి చేసే సాహసం చేస్తే మాత్రం ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని అమెరికాను హెచ్చరించారు.

రష్యాకు చెందిన రెండు అతిపెద్ద చమురు సంస్థలు- రోస్‌నెఫ్ట్, లుకాయిల్‌పై అమెరికా బుధవారం ఆంక్షలు విధించింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రష్యాపై ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో గురువారం పుతిన్ మీడియాతో మాట్లాడారు. “ఈ ఆంక్షలు కచ్చితంగా తీవ్రమైనవే. వాటి వల్ల కొన్ని పరిణామాలు ఉంటాయి. కానీ, మా ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేయలేవు” అని ఆయన అన్నారు. ఇది ఒక స్నేహపూర్వక చర్య కాదని, ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న రష్యా-అమెరికా సంబంధాలను ఇది దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తన పదవీకాలం ప్రారంభంలో రష్యాతో సత్సంబంధాలు నెరపాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే, కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించకపోవడంతో ట్రంప్ అసహనానికి గురయ్యారు. పుతిన్‌తో బుడాపెస్ట్‌లో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశం కూడా రద్దు కావడంతో ఆయన సహనం కోల్పోయి తాజా ఆంక్షలకు ఆదేశించారు.

అయితే, ఆంక్షలు విధించినప్పటికీ చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని పుతిన్ సంకేతాలిచ్చారు. “వివాదాలు, ఘర్షణల కంటే చర్చలే మేలు. మేం ఎప్పుడూ చర్చల కొనసాగింపునే కోరుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, ఉక్రెయిన్ కోరుతున్నట్లు అమెరికా టోమాహాక్ క్షిపణులతో తమపై దాడి చేస్తే మాత్రం తమ ప్రతిస్పందన చాలా బలంగా, తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.

Related posts

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం ….

Ram Narayana

మేం పాకిస్థాన్ కు విమానం నిండా ఆయుధాలు పంపించామన్నది వట్టి మాట: చైనా

Ram Narayana

నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం.. నిజాన్ని అంగీకరించిన కెనడా ప్రధాని ట్రూడో

Ram Narayana

Leave a Comment