- హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో కాల్పుల కలకలం
- దొంగలకు గాయాలు… ఆసుపత్రికి తరలింపు
- సెల్‌ఫోన్ దొంగలను పట్టుకునే క్రమంలో ఘటన
- డీసీపీ, గన్‌మ్యాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితులు
- ఆత్మరక్షణ కోసం రెండు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు
- ప్రధాన నిందితుడు ఒమర్‌పై 25 కేసులు, రౌడీషీట్ ఉన్నట్లు వెల్లడి
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం రేగింది. శనివారం సాయంత్రం చాదర్‌ఘాట్ ప్రాంతంలో ఇద్దరు సెల్ ఫోన్ దొంగలపై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సాయి చైతన్య స్వయంగా కాల్పులు జరిపారు. తనపై కత్తితో దాడికి యత్నించడంతో ఆయన ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు దొంగలకు గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే, డీసీపీ సాయి చైతన్య శనివారం సాయంత్రం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం ముగించుకుని తిరిగి తన కార్యాలయానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఒకరి నుంచి సెల్‌ఫోన్ లాక్కొని పారిపోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే అప్రమత్తమైన డీసీపీ, తన గన్‌మెన్‌తో కలిసి వారిని పట్టుకునేందుకు వెంబడించారు. ఈ క్రమంలో దొంగల్లో ఒకరు డీసీపీపై కత్తితో దాడికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో జరిగిన తోపులాటలో డీసీపీ కిందపడిపోయారు. అనంతరం ఇద్దరు దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించగా… డీసీపీ, గన్ మెన్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో దొంగలు గాయపడి, పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్వల్పంగా గాయపడిన డీసీసీ సాయి చైతన్యకు మలక్ పేట ఆసుపత్రిలో చికిత్స అందించారు.
పట్టుబడిన నిందితుడి నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వహణలో డీసీపీ సాయి చైతన్య చూపిన చొరవ, ధైర్యాన్ని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాల్పుల్లో ఇద్దరు దొంగలకూ గాయాలయ్యాయి: సీపీ సజ్జనార్

నగరంలోని చాదర్‌ఘాట్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం కాల్పుల ఘటన కలకలం రేపింది. సెల్‌ఫోన్ దొంగిలించి పారిపోతున్న ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై వారు కత్తితో దాడికి యత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు.
గాయపడిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పట్టుబడిన వారిలో ప్రధాన నిందితుడు ఒమర్ అని, అతనిపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 25 కేసులు నమోదై ఉన్నాయని సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఒమర్‌పై రౌడీషీట్ కూడా ఉందని తెలిపారు.
“నిందితుడు ఒమర్‌పై గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించాం. 2016లో కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో, 2020లో హుస్సేనీ ఆలమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. రెండుసార్లు ఏడాది పాటు చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. జైలు నుంచి బయటకు వచ్చాక కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌లో మరో రెండు కేసులు నమోదయ్యాయి” అని సీపీ సజ్జనార్ వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

