Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

మూడోసారి అధ్యక్ష పదవికి సై.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు…

  • పోటీ చేయడాన్ని ఇష్టపడతానంటూనే, దానిపై ఇంకా ఆలోచించలేదని వెల్లడి
  • అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి రెండుసార్లకు మించి లేని అవకాశం 
  • తన వారసులుగా మార్కో రూబియో, జేడీ వాన్స్‌ల పేర్లను ప్రస్తావించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగపరంగా అవకాశం లేనప్పటికీ, 2028లో మళ్లీ పోటీ చేసే ఆలోచనను ఆయన తోసిపుచ్చలేదు. తన మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ చేసిన సూచనపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు.

ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తూ మీడియాతో మాట్లాడిన ట్రంప్, “మూడోసారి పోటీ చేయడాన్ని నేను కచ్చితంగా ఇష్టపడతాను. నాకు మునుపెన్నడూ లేనంత మంచి ఆదరణ ఉంది” అని అన్నారు. అయితే, వెంటనే మాట మార్చుతూ, “దాని గురించి నేను నిజంగా ఇంకా ఆలోచించలేదు” అని పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్షుడిగా పనిచేయడానికి వీల్లేదు.

పొలిటికో కథనం ప్రకారం, ట్రంప్ సన్నిహితుడైన స్టీవ్ బానన్, ఆయన మూడోసారి పోటీ చేయాలని బలంగా వాదిస్తున్నారు. దీనికోసం ఒక ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని తన పాడ్‌కాస్ట్‌లో ఇటీవల బానన్ పేర్కొన్నారు.

ఇదే సమయంలో తన తర్వాత రిపబ్లికన్ పార్టీని నడిపించే నాయకులపై కూడా ట్రంప్ స్పష్టత ఇచ్చారు. 2028 అధ్యక్ష ఎన్నికల బరిలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాన అభ్యర్థులుగా ఉంటారని సంకేతాలిచ్చారు. “మన దగ్గర చాలా మంచి నాయకులు ఉన్నారు. వారిలో ఒకరు ఇక్కడే నిలబడి ఉన్నారు” అంటూ రూబియోను ఉద్దేశించి అన్నారు. “ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అద్భుతమైన వ్యక్తి. వీరిద్దరికీ వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయరని నేను భావిస్తున్నాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ట్రంప్ ఆసియా పర్యటనలో ఉన్నారు. మలేషియాలో ఆసియాన్ సదస్సులో పాల్గొన్న ఆయన, తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని జపాన్‌లోని టోక్యోకు చేరుకున్నారు. మలేషియా పర్యటన ముగింపు సందర్భంగా అక్కడి అధికారులు, ప్రజలకు ఆయన అభివాదం చేశారు. 

“చాలా గొప్ప, శక్తివంతమైన దేశం మలేషియా నుంచి బయలుదేరుతున్నాను. కీలకమైన వాణిజ్య, రేర్ ఎర్త్ ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అంతకుమించి థాయ్‌లాండ్, కంబోడియా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చాం. ఇక యుద్ధం లేదు! లక్షలాది ప్రాణాలను కాపాడాం. ఇప్పుడు జపాన్‌కు బయలుదేరాను” అని ఆయన ‘ట్రూత్ సోషల్’ వేదికగా పోస్ట్ చేశారు.

Related posts

నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా న‌మోదు!

Ram Narayana

 ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాలి: యూనెస్కో

Ram Narayana

హిజ్బుల్లా మీడియా చీఫ్ ను హతమార్చిన ఇజ్రాయెల్!

Ram Narayana

Leave a Comment