Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మావోయిస్టులను నిర్మూలించడం అసాధ్యం: చంద్రన్న…

Chandranna Says Eliminating Maoists Impossible Counter to Center
  • మావోయిస్టు పార్టీలో నమ్మకద్రోహులు ఉన్నారన్న చంద్రన్న
  • బసవరాజు ఎన్‌కౌంటర్‌పై కోవర్ట్ ఆపరేషన్ అనుమానం
  • అనారోగ్య కారణాలతోనే అజ్ఞాతం వీడినట్లు వెల్లడి
  • 45 ఏళ్ల తర్వాత డీజీపీ ఎదుట లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు
  • ఆపరేషన్ కగార్‌తో పార్టీని పూర్తిగా తుదముట్టించడం సాధ్యం కాదని వ్యాఖ్య

మావోయిస్టు పార్టీలో కొందరు నమ్మకద్రోహులు ఉన్నారని, బసవరాజు ఎన్‌కౌంటర్ వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగిందని మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు పల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్లుగా అజ్ఞాతంలో కొనసాగిన ఆయన, ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్‌’తో మావోయిస్టు పార్టీకి నష్టం వాటిల్లినప్పటికీ, పార్టీని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మావోయిస్టులను లేకుండా చేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్నారు. తాను ఆయుధాలు తీసుకుని మూకుమ్మడిగా లొంగిపోవడాన్ని సమర్థించనని, కేవలం తన అనారోగ్య కారణాలతోనే అజ్ఞాతం వీడానని చంద్రన్న స్పష్టం చేశారు.

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్‌కు చెందిన చంద్రన్న, 1979లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ)తో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1980లో కిషన్‌జీ అనుచరుడిగా దండకారణ్యంలోకి ప్రవేశించి, 1981లో పీపుల్స్‌వార్‌లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2024 నాటికి కేంద్ర కమిటీ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి మార్గదర్శకత్వం వహించారు.

అయితే, దీర్ఘకాలిక మోకాళ్ల వ్యాధితో ఆరోగ్యం క్షీణించడం, భద్రతా దళాల నిరంతర ఒత్తిడి, పార్టీ నాయకత్వంతో ఏర్పడిన సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాల కారణంగా ఆయన లొంగిపోయినట్లు డీజీపీ శివధర్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. సుదీర్ఘకాలం పార్టీలో కీలక పాత్ర పోషించిన చంద్రన్న చేసిన ఆరోపణలు తాజాగా కలకలం రేపుతున్నాయి.

Related posts

 ఫాంహౌస్ లో బొప్పాయి సాగు.. విత్తనాల కోసం కేసీఆర్ ఫోన్.. వీడియో ఇదిగో!

Ram Narayana

గ్రూప్-2 పరీక్షల వాయిదా.. మనస్తాపంతో వరంగల్ యువతి ఆత్మహత్య.. అర్ధరాత్రి వరకు ఉడికిపోయిన హైదరాబాద్..!

Ram Narayana

కిన్నెర కళాకారుడు మొగులయ్య ప్లాట్ కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేసిన దుండగులు

Ram Narayana

Leave a Comment