- హిడ్మాను చంపి ఎన్‌కౌంటర్ అంటున్నారు… ఎమ్మెల్యే కూనంనేని సంచలన ఆరోపణ
- మావోయిస్టు ఎన్‌కౌంటర్లపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడి
- దండకారణ్యంలోని ఖనిజాల కోసమే ఈ హత్యలు అని ఆరోపణ
- ప్రభుత్వం స్పందించకపోతే తక్షణమే కోర్టులు స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్
మావోయిస్టు నేత హిడ్మాను చంపి, దానిని ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని తెలంగాణ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ మఖ్దూం భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నర్సింహతో కలిసి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎన్ కౌంటర్ పేరుతో చంపిన మావోయిస్టుల ఘటనలు, వారి కుటుంబ నేపథ్యం సమగ్ర వివరాలపైన ఒక శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
“హిడ్మా కోరి ఉంటే నేనే స్వయంగా డీజీపీకి సరెండర్ చేయించేవాడిని. కానీ అతన్ని చంపేసి ఎన్‌కౌంటర్ అంటున్నారు” అని కూనంనేని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని, ఈ అంశంపై చర్చించేందుకు గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్యలు తెలుసుకోవాలి కానీ, ఇలా చంపడం సరికాదని విమర్శించారు. 2026 మార్చి నాటికి మావోయిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడాన్ని తప్పుబట్టారు. “ఇదేమైనా యుద్ధమా?” అని ప్రశ్నించారు. దండకారణ్యంలోని విలువైన ఖనిజ సంపద కోసమే ప్రభుత్వం మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని హతమారుస్తోందని ఆయన ఆరోపించారు. ఏకపక్ష కాల్పులను కూడా బండి సంజయ్ ఎన్‌కౌంటర్‌గా చెప్పడం దారుణమని మండిపడ్డారు. హింసను వీడి, శాంతియుత పరిష్కారాల దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కూనంనేని సూచించారు.
ఎన్ కౌంటర్ పేరుతో ‘మావోయిస్టుల ప్రభుత్వ హత్యల’పైన వెంటనే సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ,ఎంఎల్ ఎ కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఒక దొంగను చంపినా సుమోటోగా కేసులను స్వీకరించే న్యాయస్థానాలు మావోయిస్టులు విషయంలో మాత్రం స్పందించడం లేదని, న్యాయస్థానాల మౌనం చాలా నష్టధాయకమని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తక్షణమే కోర్టులు స్పందించి విచారణ చేపట్టాలని ఆయన న్యాయ స్థానాలను కోరారు. ఎన్ కౌంటర్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ‘ మావోయిస్టుల ఏక పక్ష హత్యల’పైన హైదరాబాద్, మఖ్ధూం భవన్ లో వామపక్ష, ప్రజాస్వామిక మేధావులతో గురువారం ఉదయం 11గంటలకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.
మావోయిస్టు నాయకుడు హిడ్మా రక్షణ కోసం లొంగిపోయే అవకాశాలు ఉంటే, సంప్రదింపులు జరపాల్సిన వారు, ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్రహోం మంత్రి అమిత్ ప్రకటించారని గుర్తు చేశారు. కాల్పులను విరమించిన వారిపైన ఏకపక్షంగా కాల్పులు జరపడం ఇదేం యుద్ధధర్మమన్నారు. రాహుల్ తన తండ్రి రాజీవ్ చంపిన దోషులకు క్షమాబిక్ష పెట్టాలని కోరిన విషయాన్ని కూనంనేని గుర్తు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 12వందల మందిని చంపిందని, రెండేళ్ల కాలంలో 900ల మందిని హత్య చేసిందన్నారు. ఇప్పటికైనా ఎన్ కౌంటర్ నిలిపివేసి, పోలీసుల అదుపులో ఉన్నట్టు చెబుతున్న మావోయిస్టు నాయకులు తిరుపతితో పాటు అందరినీ న్యాయస్థానంలో హాజరుపర్చాలని, చట్టపరంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కొందరు అక్రమ మార్గంలో వేల కోట్లు సంపాదించిన వారు పార్లమెంట్ ఉంటే, ప్రజల కోసం పనిచేసే వారు జైలులో, అడవుల్లో ఉంటున్నారన్నారు. 1952 అనుభవాలు దృష్టిలో పెట్టుకుని మావోయిస్టులు తమ మార్గాన్ని వదిలి, పేద వర్గాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి పనిచేసేందుకు ముందుకురావాలని కోరారు. మావోయిస్టు హత్యలపైన న్యాయపోరాటం చేసే విషయమూ ఆలోచిస్తామని, అలాగే అందరిని కలుపుకుని పోరాటం చేస్తామన్నారు.
కఠినంగా వ్యవహారించేవాళ్లు ప్రభుత్వం ఎలా నడిపిస్తారు..?
దేశంలో మనిషి ప్రాణానికి విలువ ఇవ్వడం లేదని, ప్రజాస్వామ్య దేశంలోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, కనీసం మానవత్వంగా వ్యవహారించకుండా, కఠినంగా వ్వవహారించే వారు(కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం) ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారని, ఇలాంటి వారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారా? అని కూనంనేని సాంబశివ రావు దుయ్యబట్టారు. పేద వర్గాల తరపున పోరాటం చేసే వారిని, ప్రభుత్వాలను ప్రశ్నించిన వారిని గతంలో జైలులో పెడితే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేస్తూ చంపేస్తున్నారని, ఇందుకు హిడ్మానే నిదర్శనమన్నారు. బ్రిటీష్ కాలంలో కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేసే వారిని, ప్రశ్నించేవారిని పిలిచి మాట్లాడేవారని, కానీ ప్రస్తుతం కనిపించినవారినల్లా చంపుకుంటూ వెళ్తున్నారని, ఇలా చేస్తే సమాజంలో మనుషులు ఉంటారా? అని అన్నారు. పుల్వామా దాడి నేపథ్యంలో చర్చలకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం, భారతదేశానికి చెందిన, పేద వర్గాల కోసం పనిచేసే మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపబోరని నిలదీశారు. మావోయిస్టులను చంపిన వారిని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ అభినంధిస్తున్నారని, ఒక దేశం మరో దేశంపైన గెలిచినట్టుగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ కౌంటర్ ఆగబోవని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెబుతున్నారని, ఎన్ కౌంటర్‌కు ఫేక్ఎన్ కౌంటర్‌కు తేడా లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
సిద్ధాంతాలను, బావాలను చంపడం సాధ్యం కాదు..
మనుషులను చంపినంత మాత్రానా, సిద్ధాంతాలను, బావాలను చంపడం సాధ్యం కాదనే విషయం మానవ చరిత్ర చెబుతుందని కూనంనేని సాంబశివరావు గుర్తు చేశారు. మావోయిస్టులు తమ కుటుంబాలను, జీవితాలను వదులుకుని అడవుల్లో జీవిస్తున్నారని, వారు ఏ సమస్యల కోసం అడవి బాట పట్టారో ఆ సమస్యల పరిష్కారానికి ఆలోచించాలని సూచించారు. మావోయిస్టులను చంపేస్తే ఇక అడవీ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనీజాల విషయంలోఎవ్వరూ అడిగేవారు ఉండబోరని కేంద్రం బావి స్తుందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని జంగల్ రాజ్ గా మారుస్తున్నారని కూనంనేని సాంబశివరావు దుయ్యబట్టారు. బిజెపిని ప్రశ్నించే వారిని అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్ నమూనాగా పరిపాలిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు భయానకంగా శిక్షిస్తారని, ఇలాంటి వారు కాలగర్బంలో కలువక తప్పదని హెచ్చరించారు. నేపాల్,శ్రీలంకలో కూడా ఇదే జరిగిందని కూనంనేని గుర్తుచేశారు.