మంత్రి పొంగులేటి స్వగ్రామంలో ఏకగ్రీవం
పార్టీలకతీత నిర్ణయం…. కాంగ్రెస్ అభ్యర్థికే సర్వసమ్మతి
నారాయణపురం సర్పంచ్‌గా గొల్లమందల వెంకటేశ్వర్లు ఖరారు
మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమన్వయంతో ఏకాభిప్రాయం
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. మండల పరిధిలో మూడో విడతలో జరగాల్సిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ లేకుండానే ఫలితం తేలిపోయింది.
- గ్రామ అభివృద్ధి కోసం ఏక కంఠం
ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేసిన ఈ స్థానానికి గ్రామాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా గ్రామ పెద్దలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ఒకే అభిప్రాయంతో ముందుకొచ్చారు. రాజకీయాలను పక్కనబెట్టి కాంగ్రెస్ అభ్యర్థికి సర్వసభ్య మద్దతు ప్రకటించారు. - మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమన్వయంతో ఏకాభిప్రాయం
ఈ ఏకగ్రీవానికి మంత్రి సోదరుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. గ్రామంలోని అన్ని వర్గాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి అభిప్రాయ భేదాలను సర్ధుబాటు చేసి ఏకాభిప్రాయాన్ని ఏర్పరిచారు. దీంతో పంచాయతీ పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఏర్పడే దిశగా మార్గం సుగమమైంది.
- మంత్రి పొంగులేటి అభినందనలు… ప్రజల్లో హర్షం
ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటేశ్వర్లుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపురం అభివృద్ధి పథంలో ఇది శుభ సూచికమని మంత్రి వ్యాఖ్యానించారు. స్వగ్రామం ఏకగ్రీవం కావడంతో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వెల్లివిరుస్తోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: