- సిడ్నీలో హనుక్కా వేడుకపై కాల్పులు.. ఉగ్రదాడిగా నిర్ధారణ
- దాడికి పాల్పడింది 50 ఏళ్ల తండ్రి, 24 ఏళ్ల కొడుకు
- పోలీసుల కాల్పుల్లో తండ్రి మృతి.. కొడుకు పరిస్థితి విషమం
- లైసెన్సు ఉన్న ఆరు తుపాకులతో దాడికి పాల్పడినట్లు వెల్లడి
- ఘటనా స్థలంలో రెండు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రఖ్యాత బోండీ బీచ్‌లో యూదుల హనుక్కా వేడుకలో జరిగిన కాల్పుల ఘటనను పోలీసులు ఉగ్రదాడిగా ప్రకటించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది తండ్రీకొడుకులని, వీరి వయసు 50, 24 సంవత్సరాలని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ దాడిలో ఇతర నిందితుల ప్రమేయం లేదని కూడా వారు స్పష్టం చేశారు.
న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ మాట్లాడుతూ పోలీసుల ఎదురుకాల్పుల్లో 50 ఏళ్ల తండ్రి అక్కడికక్కడే మరణించగా, 24 ఏళ్ల కొడుకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో పోలీసుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. దర్యాప్తులో భాగంగా సిడ్నీ శివార్లలోని బోనీరిగ్, క్యాంప్సీ ప్రాంతాల్లో ఉన్న రెండు ఇళ్లపై దాడులు చేసి సోదాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు.
మరణించిన 50 ఏళ్ల వ్యక్తి లైసెన్సుడ్ గన్ హోల్డర్ అని, అతడి పేరు మీద ఆరు తుపాకులు రిజిస్టర్ అయి ఉన్నాయని కమిషనర్ నిర్ధారించారు. దాడిలో బహుశా అవే ఆయుధాలను వాడి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలం సమీపంలో రెండు శక్తివంతమైన బాంబులను (IEDs) కూడా కనుగొని నిర్వీర్యం చేసినట్లు ఆయన వెల్లడించారు.
దాడి వెనుక ఉన్న ఉద్దేశంపై దర్యాప్తు కొనసాగుతోందని, ఘటనా స్థలంలో ఐసిస్ జెండా లభించిందన్న వార్తలపై ఆయన స్పందించలేదు. ఈ దాడిలో గాయపడిన ఇద్దరు పోలీసు అధికారులు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రార్థనా స్థలాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
తండ్రి పండ్ల వ్యాపారి.. కొడుకు నిరుద్యోగి.. చేపల వేటకు వెళుతున్నామని చెప్పి, 15 మందిని చంపేశారు!

- బాండీబీచ్ కాల్పులకు పాల్పడింది తండ్రీకొడుకులేనని నిర్ధారణ
- హనుక్కా వేడుకలే లక్ష్యంగా దాడి
- దూరశ్రేణి తుపాకులతో కాల్పులు
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ కాల్పుల ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులను పోలీసులు తండ్రీకొడుకులుగా గుర్తించారు. యూదుల హనుక్కా వేడుకలే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 15 మంది మరణించగా, 42 మంది గాయపడ్డారు. నిందితులను 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, అతని 24 ఏళ్ల కొడుకు నవీద్ అక్రమ్‌గా పోలీసులు ప్రకటించారు.
తండ్రీకొడుకులైన నిందితుల్లో తండ్రి సాజిద్ పండ్ల వ్యాపారి కాగా, కుమారుడు నవీద్ నిరుద్యోగి. ఘటనా స్థలంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్కడికక్కడే మరణించగా, నవీద్ తీవ్ర గాయాలతో పట్టుబడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నా, నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరిద్దరూ “లాంగ్ ఆర్మ్స్” (దూర శ్రేణి తుపాకులు)తో దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ దాడికి ముందు, తాము చేపల వేటకు సౌత్ కోస్ట్‌కు వెళ్తున్నామని నిందితులు తమ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. అయితే, తన కొడుకు ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నానని నవీద్ తల్లి వెరీనా కన్నీటిపర్యంతమయ్యారు. “మా వాడు చాలా మంచివాడు. అతడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. పనికి వెళ్లడం, ఇంటికి రావడం, వ్యాయామం చేయడం తప్ప మరో ప్రపంచం తెలియదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుద్యోగి అయిన నవీద్, రెండు నెలల క్రితమే తన ఉద్యోగాన్ని కోల్పోయి మరో పని కోసం వెతుకుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారిలో 10 ఏళ్ల బాలిక నుంచి 87 ఏళ్ల వృద్ధుడి వరకు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో సిడ్నీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.