జాతీయ వార్తలు

భట్టిపై కథనాలు…నైనీ బొగ్గు గని మైనింగ్ టెండర్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన డిప్యూటీ సీఎం

తనపై ఒక మీడియా పనికట్టుకొని తప్పుడు కథనాలు ప్రచురించి ,ప్రసారం చేయడంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం ,ఆర్థిక ,విద్యుత్ ,ప్రణాళికల శాఖ మంత్రి మల్లు భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు ..కథనాల్లో వచ్చిన బొగ్గుగని టెండర్లను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు .ఆదివారం హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తాను 40 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి పార్టీ సైనికుడిగా పనిచేశాను . నేను ఇక్కడకు వచ్చానంటే గాలికి రాలేదు.ఒక నిబద్ధతకలిగినవాన్ని అనవసరంగా నిందలు వేయడం తగదని అన్నారు . భయపెడితే ,భయపడేవాన్నికాదని అన్నారు .

తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్‌ను రద్దు చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యాన్ని ఆదేశించినట్లు ఆదివారం ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే కొత్తగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు.

నైనీ కోల్ బ్లాక్ టెండర్ ప్రక్రియలో తన పాత్ర ఉందంటూ ఒక తెలుగు టీవీ ఛానెల్, పత్రికలో వచ్చిన కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి కట్టుకథలు ప్రచురించారని ఆరోపించారు. ఇంకా ఎవరూ పాల్గొనని టెండర్ విషయంలో తమను ఎలా నిందిస్తారని కంపెనీ యాజమాన్యం తన దృష్టికి తెచ్చిందని వివరించారు. టెండర్ నిబంధనలను రూపొందించేది సింగరేణి యాజమాన్యమే తప్ప మంత్రి కాదన్న కనీస అవగాహన కూడా లేకుండా కథనాలు రాశారని విమర్శించారు.

కాగా, ఒడిశాలోని నైనీ బొగ్గు గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ దాదాపు దశాబ్దం క్రితం సింగరేణికి కేటాయించింది. గతేడాది ఏప్రిల్‌లో ఈ గనిలో బొగ్గు ఉత్పత్తిని భట్టి విక్రమార్క ప్రారంభించారు. సింగరేణి చరిత్రలో తెలంగాణ వెలుపల ఉత్పత్తి ప్రారంభించిన తొలి గని ఇదే కావడం గమనార్హం.

కట్టుకథలు, పిట్ట కథలు అల్లి ప్రజలను మభ్య పెట్టేలా కథనాలు ప్రచురిస్తే భయపడి లొంగిపోయే వ్యక్తిని కాదంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ పత్రికపై మండిపడ్డారు. నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో తనపై ఆరోపణలు గుప్పిస్తూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై భట్టి స్పందించారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్తుల సంపాదన కోసమో, వ్యాపారాన్ని విస్తరించుకునేందుకో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను, వనరులను ప్రజలకు సమానంగా పంచడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు.

“నైనీ బొగ్గు బ్లాక్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు సూచించాం. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థే తప్ప మంత్రి కాదు. గనులు ఉన్న ప్రాంతం క్లిష్టమైనది కావడంతో ఫీల్డ్ విజిట్ నిబంధన తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. సింగరేణి ప్రజల ఆస్తి.. బొగ్గు గనులు ప్రజల ఆత్మగౌరవం. గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతాను. మీడియా సంస్థల మధ్య ఉన్న విషయాల్లోకి ప్రజాప్రతినిధులను లాగొద్దు.

వ్యక్తిత్వాన్ని హననం చేసే కథనాలు రాసే అధికారం ఎవరికీ లేదు. ఆ మీడియా కథనంలో నా పేరును అనవసరంగా తీసుకువచ్చారు. ఆ పత్రికలో వచ్చిన కథనం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటో తెలిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తా. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిపై ఉన్న కోపాన్ని ఆయన సన్నిహితుడినైన నాపై చూపిస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు కట్టుకథలు రాశారు. ఈ కట్టుకథలకు భయపడి లొంగిపోయే వ్యక్తిని కాదు” అని భట్టి విక్రమార్క అన్నారు.

Related posts

అజిత్ పవార్ మరణం.. ఆ విమానాలను నిలిపేస్తారా అంటే యజమాని ఏమన్నారంటే?

Ram Narayana

భారీ వర్షాలు.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత‌…

Ram Narayana

పేపర్ లీక్ చేస్తే కోటి జరిమానా …కేంద్ర చట్టం

Ram Narayana