తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఆ వెయ్యి కోట్లు ఎక్కడ్నించి తెచ్చావు?: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

  • ఆదిలాబాద్ జైలులో బాల్క సుమన్ ను పరామర్శించిన కేటీఆర్ 
  • గాంధీ కుటుంబానికి వేల కోట్లు పంపుతున్నారని రేవంత్ సర్కార్‌పై ఆరోపణ
  • ఆ వెయ్యి కోట్లు నీ అయ్యా సొమ్మా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించిన వైనం
  • రైతు బంధు, రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శ
  • పాలనను వదిలేసి దోపిడీకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ధ్వజం
  • సీఎం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని నిలదీత

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలనను పూర్తిగా గాలికొదిలేసి, దోపిడీయే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని, తెలంగాణ ప్రజల సొమ్మును ఢిల్లీలోని గాంధీ కుటుంబానికి తరలిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సమస్యలపై కాకుండా, రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి సమర్పించుకుంటున్న వేల కోట్ల రూపాయల గురించే చర్చ జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్ల కాలంలోనే ఢిల్లీకి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వద్ద వెయ్యి కోట్లు సిద్ధంగా ఉన్నాయంటే, రాష్ట్ర ప్రజల సొమ్మును ఇంకెన్ని వేల కోట్లు మింగేశారో అర్థం చేసుకోవాలని అన్నారు. “ఆ వెయ్యి కోట్లు నీ అయ్యా సొమ్మా? లేక నీ అబ్బ సొమ్మా? ఎక్కడి నుంచి తెచ్చావు?” అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా ప్రశ్నించారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకుని గాంధీ కుటుంబానికి కప్పం కడతారా అంటూ మండిపడ్డారు.

రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అగాధంలోకి నెట్టిందని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో డిసెంబర్‌లోనే రైతుల ఖాతాల్లో చేరే రైతుబంధు నిధులు, మార్చి నెల వచ్చినా ఇప్పటికీ అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. రైతుబంధు ఇచ్చే తెలివి, రుణమాఫీ చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేవని దుయ్యబట్టారు. కనీసం రైతులు పండించిన జొన్న, పత్తి పంటలను కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఇంత బాహాటంగా అవినీతికి పాల్పడుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని ఆయన నిలదీశారు.

Related posts

తెలంగాణలో బిజెపి నథింగ్… కాంగ్రెస్ తోని మాకు ఫైట్… కేటీఆర్

Ram Narayana

నేను ఆఖరి ‘రెడ్డి’ ముఖ్యమంత్రిని అయినా ఫర్వాలేదు,…రేవంత్ రెడ్డి

Ram Narayana

తెలంగాణలో బీజేపీకి షాక్.. వరంగల్ జిల్లాలో రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే…

Ram Narayana