జాతీయ వార్తలు

38 మంది మావోయిస్టుల ఆచూకీపై వీడని చిక్కుముడి

  • అడవి బాట పట్టిన వారి ఆచూకీపై వీడని మిస్టరీ
  • లొంగిపోయిన నేతల సమాచారంతో జాబితా సవరించామన్న పోలీసులు
  • తమ వారి వివరాలు చెప్పాలంటూ ఆందోళనలో కుటుంబ సభ్యులు
  • అడవుల్లో మరణాలు బయటకు రావని చెబుతున్న మాజీ మావోయిస్టులు

దశాబ్దాల క్రితం నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టిన 38 మంది మావోయిస్టుల పేర్లను తెలంగాణ పోలీసులు తమ ‘వాంటెడ్’ జాబితా నుంచి తొలగించడం పెను సంచలనంగా మారింది. వారు బతికే ఉన్నారా లేక కాలగర్భంలో కలిసిపోయారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ అనూహ్య పరిణామం తమ వారు ఏదో ఒకరోజు తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నింపుతోంది.

గతేడాది వరకు తెలంగాణకు చెందిన 55 మంది మావోయిస్టులు అడవుల్లో క్రియాశీలకంగా ఉన్నారని చెప్పిన పోలీసులు, తాజాగా ఆ సంఖ్యను కేవలం 11కి తగ్గించడం గమనార్హం. ఈ విషయంపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందిస్తూ ఇటీవల లొంగిపోయిన అగ్రనేతలను విచారించినప్పుడు ఈ 38 మంది గురించి ఎలాంటి సమాచారం లభించలేదని తెలిపారు. వారు చాలాకాలం క్రితమే పార్టీని వీడి ఉండవచ్చని లేదా మారుపేర్లతో ఎక్కడో రహస్యంగా జీవిస్తూ ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అందుకే వారిని జాబితా నుంచి తొలగించామని స్పష్టం చేశారు.

అయితే, మాజీ మావోయిస్టు నేత జంపన్న వాదన మరోలా ఉంది. అడవిలో అనారోగ్యం, అంతర్గత కలహాలు లేదా ఎదురుకాల్పుల్లో జరిగే మరణాలు చాలా వరకు రహస్యంగానే ఉండిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేవరకొండ సత్యనారాయణ (బుక్క సత్తన్న), కొల్లు శ్రీనివాసరెడ్డి, రంగు అరుణ, కాశబోయిన స్వరూప వంటి వారి కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. 

Related posts

తమిళ భాష పత్తాలేకుండా పోతుంది: సీఎం స్టాలిన్ ఆందోళన!

Ram Narayana

ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ తొలి సంతకం చేసిన ఫైలు ఇదే!

Ram Narayana

నామినేషన్ వేసి బయటకు రాగానే అభ్యర్థి అరెస్టు.. కారణం ఇదే!

Ram Narayana