ఇజ్రాయెల్ సృష్టించిన ఈ యుద్ధంతో మనకేం ప్రయోజనం?:
- జాతీయ ఉగ్ర నిరోధక కేంద్రం డైరెక్టర్‌గా ఉన్న జో కెంట్ రాజీనామా
- ఇరాన్ అమెరికాకు తక్షణ ముప్పు ఏమీ కలిగించలేదన్న జో కెంట్
- ఇజ్రాయెల్ ఒత్తిడితో ఈ యుద్ధం వచ్చిందని ఆవేదన
ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధానికి మద్దతు ఇవ్వలేనంటూ అమెరికాకు చెందిన కీలక అధికారి ఒకరు రాజీనామా చేశారు. అమెరికా జాతీయ ఉగ్ర నిరోధక కేంద్రం డైరెక్టర్‌గా ఉన్న జో కెంట్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ మన దేశానికి తక్షణ ముప్పు ఏమీ కలిగించలేదని అన్నారు. ఇజ్రాయెల్ ఒత్తిడి కారణంగానే ఈ యుద్ధం ప్రారంభమైందని అన్నారు.
యుద్ధం కోసం ఇజ్రాయెల్‌తో పాటు దాని శక్తిమంతమైన అమెరికన్ లాబీ నుంచి ఒత్తిడి వచ్చిందని ఆరోపించారు. తాను చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. ఒకవైపు హర్మూజ్‌ను రక్షించడానికి అన్ని దేశాలు కలిసి రావాలని ట్రంప్ విజ్ఞప్తి చేస్తుండగా, ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి తరుణంలో కీలక అధికారి రాజీనామా చేయడం గమనార్హం.
ఈ మేరకు జో కెంట్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. మూడు అధ్యక్ష ఎన్నికల సందర్భంగా మీరు ప్రచారం చేసిన విలువలకు, మొదటి హయాంలో అమలు చేసిన విదేశాంగ విధానాలకు మద్దతుగా ఉన్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ యుద్ధాలు మన పౌరులు, సైన్యం ప్రాణాలు తీయడంతో పాటు దేశ సంపదను క్షీణింపజేశాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కానీ ఇటీవల ఉన్నతస్థాయి ఇజ్రాయెల్ అధికారులు, అమెరికన్ మీడియాలోని ప్రభావవంతమైన కొందరు వ్యక్తులు ఇరాన్ విషయంలో తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఇది ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదాన్ని దెబ్బతిసి, ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లేలా చేసిందని వాపోయారు. ఇరాన్ అణుకేంద్రాలు అమెరికాకు తక్షణ ముప్పుగా పరిణమించిందని, ఇప్పుడు దాడి చేస్తే విజయం సాధించవచ్చని నమ్మించారని ఆరోపించారు.
గతంలో ఇరాక్, ఇప్పుడు ఇరాన్ యుద్ధంలోకి అమెరికన్లను లాగడానికి ఇజ్రాయెల్ ఎత్తుగడలు వేసిందని అన్నారు. ఇలాంటి తప్పులను అమెరికా ప్రభుత్వం మళ్లీ చేయవద్దని కోరారు. 11 సార్లు యుద్ధానికి వెళ్లిన ఒక సైనికుడిగా, ఇజ్రాయెల్ సృష్టించిన యుద్ధంలో భార్యను కోల్పోయిన వ్యక్తిగా చెబుతున్నానని, ఇజ్రాయెల్ సృష్టించిన యుద్ధాలు అమెరికాకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చవని పేర్కొన్నారు. ఇలాంటి యుద్ధాలకు అమెరికన్ పౌరులను పంపించడాన్ని తాను సమర్థించలేనని అన్నారు. మనం ఇరాన్‌లో ఏం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నామో పునరాలోచించుకోవాలని ట్రంప్‌కు రాసిన లేఖలో కెంట్ పేర్కొన్నారు.
అతడు బలహీనుడు, వెళ్లిపోవడం మంచిదే!.. కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామాపై ట్రంప్ వ్యాఖ్యలు

‘‘అతడొక బలహీనుడు, యుద్ధ వ్యూహాల విషయంలో పనికిరాడు! అలాంటి వ్యక్తి వైదొలగడం దేశానికి మంచిదే!’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తన ప్రభుత్వంలో అత్యంత కీలకమైన కౌంటర్ టెర్రరిజం చీఫ్ జో కెంట్ రాజీనామాపై స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ తీవ్ర వ్యాఖ్యలతో అమెరికా ప్రభుత్వంలో ఇరాన్ విధానాలపై నెలకొన్న అంతర్గత పోరు ఒక్కసారిగా బట్టబయలైంది.
పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న దూకుడు విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జో కెంట్ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఇరాన్‌పై దాడులు, ఆ దాడుల్లో అమాయక పౌరుల మరణాలు, ప్రాంతీయ అస్థిరత వంటి అంశాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్‌హౌస్ వర్గాల కథనం. వ్యూహాత్మక విభేదాలు తారస్థాయికి చేరడంతోనే ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ట్రంప్ నిప్పులు..
ఒక కీలక అధికారి రాజీనామాపై సంయమనం పాటించాల్సింది పోయి, ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘‘జో కెంట్ రాజీనామాను నేను స్వాగతిస్తున్నాను. దేశ భద్రత విషయంలో మెతక వైఖరి అవలంబించే వారికి నా ప్రభుత్వంలో స్థానం లేదు. కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యశాలురే నాకు కావాలి. కెంట్ వంటి వారు ఇక్కడ సరిపోరు. అతడు వెళ్లిపోవడం చాలా మంచిదైంది’’ అని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. సొంత అధికారిపై అధ్యక్షుడే ఈ స్థాయిలో విమర్శలు చేయడం అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
బయటపడ్డ భిన్నాభిప్రాయాలు..
ఈ రాజీనామా, ఆ తర్వాత ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్ విషయంలో వైట్‌హౌస్‌కు, భద్రతా, నిఘా వర్గాలకు మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయి వాస్తవాలను, భవిష్యత్ పర్యవసానాలను భద్రతా అధికారులు వివరిస్తుంటే, రాజకీయ ప్రయోజనాల కోసం దూకుడుగా ముందుకు వెళ్లాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. అయితే, తన దూకుడు తగ్గించే ప్రసక్తే లేదని, ఇరాన్‌కు తగిన గుణపాఠం చెప్పి తీరుతామని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఈ పరిణామం అమెరికా అంతర్గత రాజకీయాల్లోనే కాకుండా, మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.