జాతీయ వార్తలు

సీట్ల దోపిడీకి చెక్.. విమాన ప్రయాణికులకు కేంద్రం ఊరట…

విమాన టికెట్ కొన్నాక, వెబ్ చెక్-ఇన్ చేసేటప్పుడు నచ్చిన సీటు కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందా? ఈ అనుభవం చాలామంది ప్రయాణికులకు ఎదురయ్యేదే. కొన్నిసార్లు విమానంలోని అన్ని సీట్లను ‘పెయిడ్’ సీట్లుగా చూపిస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న ఎయిర్‌లైన్స్‌కు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రయాణికుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో, విమానాల్లో సీట్ల ఎంపికపై కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలి. కేవలం మిగిలిన 40 శాతం సీట్లకు మాత్రమే (ముందు వరుసలు, ఎక్కువ లెగ్ స్పేస్ ఉన్న ప్రీమియం సీట్లు వంటివి) అదనపు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ఎయిర్‌లైన్స్‌కు వెసులుబాటు కల్పించారు.

గత కొంతకాలంగా, దాదాపు అన్ని విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ సమయంలో రూ. 200 నుంచి రూ. 1500 వరకు వసూలు చేస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఈ అంశం పార్లమెంటరీ కమిటీ దృష్టికి కూడా వెళ్లడంతో, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఒకవేళ ప్రయాణికులు వెబ్ చెక్-ఇన్ సమయంలో సీటును ఎంచుకోకపోయినా లేదా ఉచిత సీట్లు అందుబాటులో లేకపోయినా, విమానాశ్రయంలోని కౌంటర్ వద్ద వారికి ఉచితంగానే సీటును కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ వంటి అన్ని దేశీయ విమానయాన సంస్థలు వీటిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ఈ నిబంధనల అమలును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పర్యవేక్షిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. 

Related posts

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం … స్పందించిన సోనియా గాంధీ

Ram Narayana

ఝార్ఖండ్‌లో చోరీ అనుమానంతో మహిళపై అమానుష చర్య!

Ram Narayana

బంగారం స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ… గుర్తించడం చాలా కష్టం!

Ram Narayana