అంతర్జాతీయం

అక్రమ వలసదారులకు ట్రంప్ భారీ ఆఫర్…

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని ప్రకటించింది. బలవంతంగా కాకుండా, వారంతట వారే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేవారికి భారీ ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇలా వెళ్లేవారికి 2,600 డాలర్లు (సుమారు రూ. 2.40 లక్షలు) ‘ఎగ్జిట్ బోనస్’గా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఈ నగదు ప్రోత్సాహకంతో పాటు, వారి స్వదేశాలకు వెళ్లేందుకు అయ్యే విమాన ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారు ‘సీబీపీ హోమ్’ అనే ప్రత్యేక యాప్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నమోదు చేసుకున్న వారిని బలవంతపు బహిష్కరణ జాబితా నుంచి తొలగిస్తారు.

ఈ కొత్త విధానం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా భారీ ఆదా అవుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. ఒక వలసదారుడిని బలవంతంగా అరెస్ట్ చేసి, దేశం నుంచి పంపడానికి సుమారు 18,245 డాలర్లు ఖర్చవుతుండగా, ఈ స్వచ్ఛంద పథకానికి కేవలం 5,100 డాలర్లతోనే పని పూర్తవుతుందని తెలిపింది. ఇది అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఆదా చేస్తుందని వివరించింది.

అయితే, ఈ అవకాశాన్ని వినియోగించుకోని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. ‘‘గౌరవంగా వెళ్లిపోండి, లేదంటే మేమే పట్టుకుని అరెస్ట్ చేస్తాం. అప్పుడు మళ్లీ అమెరికాలో అడుగుపెట్టలేరు’’ అని సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్ స్పష్టం చేశారు. గతంలో 1,000 డాలర్లుగా ఉన్న ఈ బోనస్‌ను, ట్రంప్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా 2,600 డాలర్లకు పెంచింది. ఇప్పటివరకు ఈ విధానంలో సుమారు 22 లక్షల మంది అమెరికాను వీడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Related posts

‘ఇండియా’ పేరు మార్పు అంశంపై ఐక్యరాజ్య సమితి స్పందన

Ram Narayana

యూఏఈలో లక్కీ డ్రాలో రూ.45 కోట్లు గెలుచుకున్న భారతీయుడు.. అతడి స్పందన ఏంటంటే..!

Ram Narayana

ఓడిపోతే ఇక అంతే.. ఇంకోసారి పోటీ చేయను: ట్రంప్

Ram Narayana