జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు బై …బీఆర్ యస్ కు జై ..?
ఫలించని మంత్రుల బుజ్జగింపులు ..
దేవుడు శాసిస్తాడు …మానవుడు అనుసరిస్తాడు.. జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ విధానాలు మారిపోయాయన్న మాజీ మంత్రి
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి తో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ..బీఆర్ ఆర్ యస్ కు జైకొట్టనున్నారా ..? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు …కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జగిత్యాల జిల్లాకు చెందిన మంత్రి వడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డి తో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పెట్టారు .. గంటకు పైగా పార్టీ మరవద్దని పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు .. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన జీవన్ రెడ్డి వారి మాటలు సావధానంగా విని వారితో ఎక్కువగా ఆర్గ్యుమెంట్ పెట్టకుండా నవ్వుతూనే దేవుడు శాసించాడు …మానవుడు అనుసరిస్తాడని చెప్పారు ..ఇదే విషయాన్నీ మంత్రులు వెళ్లిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ..తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు …రేపు జరగబోయే కార్యకర్తల సమావేశం అనంతరం తన వైఖరిని వెల్లడిస్తానని అన్నారు ..
అసలు పంచాయతీ ఎక్కడ …
జగిత్యాల లో బీఆర్ యస్ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కు దగ్గరైయ్యారు . ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన జీవన్ రెడ్డికి అది ఇష్టం లేదు .పైగా తనకు మాటమాత్రం చెప్పకుండా సంజయ్ ని పార్టీలోకి తీసుకోవడంపై అభ్యంతరం చెప్పారు .. నియోజకవర్గంలో సంజయ్ కి ప్రయారిటీ ఇవ్వడం జీవం రెడ్డికి సుతారం ఇష్టం లేదు …సహజంగానే ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో ప్రయారిటీ ఉంటుంది ..అది కాంగ్రెస్ కు దగ్గరైన తర్వాత అధికార ఎమ్మెల్యేలాగానే ఆయన వ్యవహరించడం అధికారుల దగ్గర కూడా ఆయన మాట చెల్లుబాట కావడంతో జీవన్ రెడ్డి తట్టుకోలేక పోయారు..పైగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళను కాదని కొత్త వచ్చినవారికి టికెట్స్ ఇవ్వడంపై మండిపడ్డారు ..చివరకు స్వతంత్రంగా కొందరిని పోటీకి దించి గెలిపించుకున్నారు ..అయినప్పటికీ ఆయన వర్గానికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కలేదు . నాటి నుంచి ఆయన పార్టీని వీడాలని ఆలోచన చేసినట్లు తెలుస్తుంది …
నిర్ణయంలో ఎలాంటి మార్పులేదు, దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడు: జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని జగిత్యాల నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తానని ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం తదితరులు ఈరోజు జీవన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. పార్టీ మారతానని ఆయన ప్రకటించిన నేపథ్యంలో మంత్రులు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
జీవన్ రెడ్డితో మంత్రులు గంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాను అనుకున్న తేదీలోనే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, కొత్తగా వచ్చిన వారిని అందలమెక్కిస్తున్నారని, అందుకే తాను పార్టీ వీడుతున్నానని జీవన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.
కాగా, జీవన్ రెడ్డి అధిష్ఠానాన్ని కలవడానికి అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన హైదరాబాద్‌లో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సమావేశం కావాల్సి ఉంది. కానీ ఆయన జగిత్యాలలోనే ఉండిపోయారు. అధిష్ఠానం నుంచి జీవన్ రెడ్డికి ఎలాంటి ఫోన్ రాలేదని ఆయన వర్గం నాయకులు చెబుతున్నారు. నేడు మంత్రులతో జరిగిన చర్చలు కూడా విఫలమైనట్లు జీవన్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు.
జీవన్ రెడ్డి నివాసంలో ‘బ్రేక్ ఫాస్ట్’ రాజకీయం: మంత్రుల బుజ్జగింపులు ఫలించేనా?
దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రను పోషించిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని దారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ ఫిరాయింపులు, వలస నేతల ప్రాధాన్యతపై రగిలిపోతున్న జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రుల బృందం రంగంలోకి దిగింది. ఈ ఉదయం ఆయన నివాసంలో జరిగిన ఈ భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పిలుపును కూడా తిరస్కరించిన జీవన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయన ఇంటికి వెళ్లారు. మీడియాను లోపలికి అనుమతించకుండా, అల్పాహారం చేస్తూ సుమారు గంటన్నర పాటు జీవన్ రెడ్డితో వీరు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
“నేటి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా లేదు” అని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మంత్రుల ముందే తన ఆవేదనను వెళ్లగక్కినట్లు సమాచారం. సొంత పార్టీ నేతలకు అన్యాయం చేస్తూ, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పెద్దపీట వేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రులు ఎంత బతిమాలినా జీవన్ రెడ్డి మెత్తబడినట్లు కనిపించడం లేదని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీని వీడాలని ఆయన ఇప్పటికే తన నిర్ణయాన్ని తీసేసుకున్నారని తెలుస్తోంది.
ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన పదవులకు కూడా జీవన్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఉగాది తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పిన ఆయన, బీఆర్ఎస్ వైపు వెళ్తారా? లేక స్వతంత్రంగా ఉంటారా? అనేది సస్పెన్స్‌గా మారింది.