భగత్‌సింగ్ పరిపూర్ణ కమ్యూనిస్టు…
- ప్రాణత్యాగమే కాదు… నిర్బంధంలో సైతం ప్రజల కోసం పనిచేయడం పెద్దసవాల్
- సమసమాజంగా మార్చడమే విప్లవం లక్ష్యం:.
ఖమ్మం సుందరయ్య భవనంలో జరిగిన రెడ్ బుక్స్‌డే కార్యక్రమం
:భగత్‌సింగ్ గొప్ప దేశభక్తుడే కాకుండా పరిణితి చెందిన కమ్యూనిస్టు అని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు చెప్పారు.చనిపోవడమే త్యాగం కాదన్నారు. పాలకుల నిర్బంధం ఉన్నా ప్రజల కోసం పనిచేయడమే విప్లవకారులకు పెద్ద సవాల్ అనీ, అదే గొప్ప త్యాగమనీ ఆయన వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కమ్యూనిస్టు పార్టీని నిర్మించాలనీ, ఆ సిద్ధాంతానికి చివరిదాకా కట్టుబడి ఉండాలనీ చెప్పారు. రెడ్ బుక్స్ డే సందర్భంగా ఖమ్మంలోని సుందరయ్య భవనంలో కేంద్రంలో ‘భారత విప్లవ కెరటం భగత్‌సింగ్’ పుస్తక సామూహిక పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ ప్రపంచ మానవాళి విముక్తి కోసం మార్క్స్-ఎంగెల్స్ రచించిన కమ్యూనిస్టు మ్యానిఫెస్టో గ్రంథాన్ని గతేడాది పఠించామన్నారు. ఈ ఏడాది భగత్‌సింగ్ పుస్తకాన్ని చదువుతున్నామని చెప్పారు. హింసద్వారానైనా బ్రిటీష్ వారిని పారదోలాలంటూ భగత్‌సింగ్ భావించారని వివరించారు. పార్లమెంటు మీద బాంబు వేసిన ఘటనలో 1931, మార్చి 23న అతిచిన్న వయస్సులో ఉరికంబం ఎక్కిన గొప్ప దేశభక్తుడు ఆయన అని చెప్పారు. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. భారతదేశంలో మార్క్సిజం పట్ల పూర్తిస్థాయి అవగాహన లేని కాలంలో పరిపూర్ణ కమ్యూనిస్టుగా భగత్‌సింగ్ పరిణతి చెందారని అన్నారు. అయితే ప్రగతిశీల భావాలున్న బుద్ధుడు, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి వారిని కమ్యూనిస్టులు సొంతం చేసుకోలేదని వివరించారు. మనువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి పోరాడిన అంబేద్కర్‌ను బీజేపీ సొంతం చేసుకుంటున్నదని చెప్పారు. అభ్యుదయ భావాలను ఒడిసి పట్టుకోవాలనీ, అలాంటి వారిని కమ్యూనిస్టు పార్టీ సొంతం చేసుకోవాలని కోరారు. దోపిడీని, అన్యాయాన్ని ఎదిరించడం, సమాజాన్ని మార్చడమే విప్లవమని వివరించారు. సమసమాజంగా మార్చడం విప్లవ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి భారవి, నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, వై విక్రమ్, భండారు రమేష్ తదితరులు పాల్గొన్నారు