రాజకీయ వార్తలు

రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!

రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!

  • మచిలీపట్నం సభలో జగన్‌ సమక్షంలోనే రిటైర్ మెంట్ ప్రకటన చేసిన పేర్ని నాని
  • మళ్లీ ఆయనతో మీటింగ్ లో పాల్గొంటానో లేదో తెలియదని వ్యాఖ్య
  • జగన్ చెప్పారంటే చేస్తారని, బందరుకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారని ప్రశంస

తాను రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతున్నానంటూ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. మరోసారి జగన్‌తో సమావేశం అవుతానో లేదో అంటూ ఆయన చెప్పడం గమనార్హం.

మచిలీపట్నం అభివృద్ధికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని పేర్ని నాని అన్నారు. బందరుకు సీఎం జగన్‌ పూర్వ వైభవం తీసుకొస్తున్నారని.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు. ‘‘బందరు పోర్టు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు. నక్కజిత్తుల బాబు ఇంటికెళ్తేనే బందరు పోర్టుకు అనుమతులు వచ్చాయి. బందరులో కాలనీలు కాదు.. ఊళ్లే నిర్మిస్తున్నారు’’ అని చెప్పారు.

మరోసారి జగన్‌తో వేదిక పంచుకునే అవకాశం దక్కుతుందో లేదో అంటూ తన పొలిటికల్ రిటైర్మెంట్ గురించి పేర్ని నాని ప్రస్తావించారు. ఎక్కువ సేపు మాట్లాడటంపై పక్కనున్న వారు సంకేతాలివ్వగా.. ‘‘లాస్ట్ ఇదే.. మళ్లీ జగన్ తో కలిసి నేను మీటింగ్ లో పాల్గొంటానో లేదో తెలియదు.. ఇప్పుడు నన్ను భరించాల్సిందే’’ అని అన్నారు. మరో సందర్భంలో ‘‘అందుకే రిటైర్ అయిపోతున్నా’’ అని చెప్పారు.

‘‘జగన్ చెప్పారంటే చేస్తారు. మనందరి గుండెల్లో సుస్థిరమైన, బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు సీఎం జగన్‌. నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తెస్తున్న జగన్‌కు పాదాభివందనం చేయాల్సిందే. కానీ నాకంటే వయసులో చిన్నవాడైపోయాడు. అందుకే చేతులెత్తి మొక్కుతున్నా’’ అని అన్నారు.

జగన్ టికెట్ ఇస్తే మా అబ్బాయి పేర్ని కిట్టు పోటీ చేస్తానంటున్నాడు: పేర్ని నాని

Perni Nani opines about his son political career

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని తన వారసుడ్ని తెరపైకి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సీఎం జగన్ సభలో పేర్ని నాని రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సభ ముగిసిన అనంతరం పేర్ని నాని తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు.

ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయనని కొంతకాలంగా చెబుతూనే ఉన్నానని అన్నారు. జగన్ తనను ఓ పాత స్నేహితుడిగా, అనుచరుడిగా వేదికపై పక్కన కూర్చోబెట్టుకోవచ్చేమో కానీ… వేదికలపై ఇకమీదట మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

“పేర్ని నాని ఇకపై పోటీ చేయడు… జగన్ ను వదలడు, బతికున్నంత కాలం నేను, నా కుటుంబ సభ్యులు జగన్ వెన్నంటే ఉంటాం” అని పేర్ని నాని స్పష్టం చేశారు. జగన్ ఎప్పుడు ఏ పని చెబితే ఆ పనిచేయడానికి తాను సదా సిద్ధంగా ఉంటానని వెల్లడించారు.

ఇక తన వారసుడు పేర్ని కిట్టు గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, పేర్ని నాని ఆసక్తికరంగా జవాబిచ్చారు.

“వచ్చే ఎన్నికల్లో పేర్ని కిట్టు వైసీపీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు అని చెప్పడానికి నేనెవడ్ని? అంతా జగన్ మోహన్ రెడ్డి ఇష్టం. పార్టీ అధ్యక్షుడు ఆయన. ఇందులో నా ఇష్టం ఏముంటుంది… అంతా జగన్ ఇష్టం. జగన్ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని మా అబ్బాయి అంటున్నాడు. ఒకవేళ జగన్ టికెట్ ఇవ్వకపోయినా నేను, మా అబ్బాయి, మా ఆవిడ పార్టీ జెండా మోయడం ఆగేదే లేదు. జగన్ రాజకీయాల్లో ఉన్నంతకాలం, మేం బతికున్నంతకాలం జగన్ వెంటే ఉంటాం” అంటూ పేర్ని నాని తన మనోభావాలను పంచుకున్నారు.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే తాటి చిచ్చు …

Drukpadam

ఎన్నికల స్టంట్ అనుకోండి!: ఆర్టీసీ విలీనంపై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

శివసేన ఎవరిదీ …. థాకరేదా ….? షిండేదా ….??

Drukpadam