Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఎన్నికల షడ్యూల్ కు ముందే ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్లస్థలు ఇవ్వాలి …

ఎన్నికల షడ్యూల్ కు ముందే ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్లస్థలు ఇవ్వాలి …
*ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
*పాల్గొన్న రాజకీయ పక్షాలు, జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టుల హాజరు

  • జర్నలిస్టులకు ఉచితంగా లేదంటే అతి స్వల్ఫ ధరకు ప్లాట్లు ఇవ్వాలి
  • ప్రభుత్వం, కలెక్టర్ స్పదించకపోతే కలెక్టరేట్ ముట్టడి
  • ముందుగా మంత్రి పువ్వాడ అజయ్ ని కలవాలని నిర్ణయం…

ఎన్నికల షడ్యూల్ కు ముందే ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వలని లేని యెడల ఐక్య కార్యాచరణతో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు సాధించుకుందామని జర్నలిస్టు సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నేతలు, జర్నలిస్టులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో చిత్తశుద్ధి చూపాలని కోరారు. జర్నలిస్టుల కోసం ఖమ్మంలో కేటాయించిన 23 ఎకరాల స్థలానికి అధిక ధర నిర్ణయిస్తూ జారీచేసిన జీవోను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఉచితంగా లేదంటే అతి స్వల్ఫ ధరకు ప్లాట్లు ఇవ్వాలని కోరారు. దీనికున్న అవరోధాలను జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , కలెక్టర్ వి పి గౌతమ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు. లేదంటే అఖిలపక్షాలు, జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు.‌ సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలు, జర్నలిస్ట్ సంఘాల నేతలు, జర్నలిస్టులు మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం ఆసన్నం అవుతున్న దృష్ట్యా దాదాపు 20 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలో జనవరిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఏకైక హామీగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారన్నారు. ఈ మేరకు తొలుత ఐదు, ఆ తర్వాత 23 ఎకరాలకు పైగా కేటాయించినా… పది నెలలు అవుతున్నా జర్నలిస్టులకు అందుబాటులోకి రాకపోవడాన్ని తప్పుబట్టారు. జర్నలిస్టులకు ఉచితంగా స్థలాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానికి భిన్నంగా జీవో 571 విడుదల చేసి, రూ. కోట్లు చెల్లించాలనడం తగదన్నారు. జర్నలిస్టులకు ఉచితంగా లేదంటే అతి స్వల్ప ధరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.. లేనిపక్షంలో జర్నలిస్టు యూనియన్లు, రాజకీయ పక్షాలతో కలిసి సంఘటితంగా జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని నున్నా హెచ్చరించారు. జీవో మార్చాలి, లేదంటే రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ను బేస్ చేసుకుని కనీస ధరకు జర్నలిస్టులకు ఫ్లాట్లు ఇవ్వాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావీద్ పిలుపునిచ్చారు. రూ. కోట్ల విలువ కడితే అంత మొత్తాన్ని సామాన్య జర్నలిస్టులు ఎక్కడి నుంచి తెచ్చి చెల్లిస్తారని సిపిఐ (ఎంఎల్) ప్రజా పంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిరంతరం వార్తలు రాసే జర్నలిస్టులు గూడు కోసం అడుక్కోవడం బాధాకరమని సిపిఐ జిల్లా నాయకులు శివరామకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వం, కలెక్టర్ పైన ఒత్తిడి తెచ్చి ఇళ్ల స్థలాలను సాధించాలని పిలుపునిచ్చారు.

ఇళ్ల స్థలాలు ఇచ్చి, జర్నలిస్టుల కాలనీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్న సీఎం కేసీఆర్ ఆ మాటే మరిచారని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రామనారాయణ అన్నారు.‌ రాష్ట్రంలో 25 వేల మంది జర్నలిస్టులు ఉంటే వారిలో 20వేల మంది వరకు ఇళ్ల స్థలాలు రానివారు ఉన్నారని తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేస్తామన్న మంత్రి అజయ్ కుమార్ ఏ మేరకు స్పీడప్ చేశారని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి ప్రశ్నించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో విధి విధానాలు, నియమ నిబంధనలపై స్పష్టతనివ్వడంలో మొదటి నుంచి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తుందని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కనిష్ట స్థానిక ధర ఆధారంగా విశిష్ట అధికారాలతో కలెక్టర్ జర్నలిస్టు ఇళ్ల స్థలాలను కేటాయించే అవకాశం ఉందని కేసీఆర్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వర్లు తెలిపారు. ముందే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు అవరోధం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్లలో అన్ని వర్గాలకు వరాలు కురిసినా జర్నలిస్టులపై మాత్రం ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని సొసైటీ కార్యదర్శి ఖదీర్ పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు ఐక్య కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో టిడిపి నాయకులు వడ్డేల్లి విజయ్, సీపీఐ (ఎంఎల్) ఎన్డీ నేతలు గిరి, వివి రావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు దొబ్బల సౌజన్య, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రమ్, యర్రా శ్రీకాంత్, కళ్యాణం వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్ సంఘాల నేతలు పల్లా కొండల్ రావు, వనం వెంకటేశ్వర్లు, కనకం సైదులు, ఆవుల శ్రీనివాస్, ఉషోదయం శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు వెంకట్రావు, మైస పాపారావు, నర్వనేని వెంకట్రావు, శ్రీధర్, తేనె వెంకటేశ్వర్లు, పారుపల్లి కృష్ణారావు, గుద్దేటి రమేష్, సాతుపాటి రామయ్య, నామ పురుషోత్తం, సాగర్, జి. వెంకటేశ్వర్లు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

డీప్‌ఫేక్‌ ఆడియోల ద్వారా తనపై అసత్య ప్రచారం… మండిపడ్డ మాజీమంత్రి అజయ్

Ram Narayana

పాలేరు లో పొంగులేటి ,తమ్మినేని హాట్టహాసంగా నామినేషన్లు …

Ram Narayana

పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవు: ఖమ్మంలో కలకలం రేపుతున్న పోస్టర్లు

Drukpadam

Leave a Comment