- రాజస్థాన్‌లో ఓ కాలేజీలో యువతుల ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానం
- పెళ్లి, చర్మ సంరక్షణ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన కాంగ్రెస్ నేత
- మహిళలకు ఉద్యోగం కంటే డబ్బు గురించి తెలిసి ఉండాలని సూచన
పెళ్లి గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జైపూర్ మహారాణి కాలేజీ విద్యార్థినులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని ఆయన పెళ్లి, ఆహార అలవాట్ల గురించి అడిగారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మీరు చాలా అందంగా ఉంటారు, మరి పెళ్లి గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అని ఓ యువతి ప్రశ్నించింది. దీనికి స్పందించిన రాహుల్ గాంధీ, తాను తన పనుల్లో, పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమయ్యానని, అందుకే వివాహం వైపు వెళ్లలేదని సమాధానం ఇచ్చారు. తాను కాకరకాయ, బఠానీ, బచ్చలికూర తప్ప మిగతా అన్ని ఆహార పదార్థాలు తింటానని చెప్పారు. ఇష్టమైన ప్రదేశాలు ఏమిటి? అని అడగగా, తాను ఇప్పటి వరకు వెళ్లని ప్రాంతాలే తనకు ఇష్టమైనవన్నారు. తాను ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటానని చెప్పారు. మీ చర్మ సంరక్షణ కోసం ఏం చేస్తారు? అని ఓ యువతి ప్రశ్నించారు. తాను సబ్బు, క్రీమ్‌లు పూయనని, కేవలం నీళ్లతోనే ముఖం కడుక్కుంటానని చెప్పారు.
మహిళలకు ఉద్యోగం కంటే డబ్బు గురించి తెలిసి ఉండాలన్నారు. ఉద్యోగం లేకపోయినా డబ్బును అర్థం చేసుకుంటే ఎంతో ఉపయోగకరమన్నారు. తనకు అనేక రంగాల్లో ప్రావీణ్యం ఉందని, ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పగలను, వంట బాగా చేయగలనని, కాబట్టి రాజకీయ నాయకుడిని కాకుంటే ఏం చేసేవారు అంటే సమాధానం కష్టమే అన్నారు. ఖతమ్… టాటా… బైబై అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు మీమ్స్ రూపంలో రావడంపై స్పందిస్తూ, ఈ ముచ్చట్లను త్వరగా ముగించాలని తన బృందం తనకు చెబుతోందన్నారు.