Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

 ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కోదండరాంను ఎలా ఆమోదించారు?: గవర్నర్‌కు కేటీఆర్ ప్రశ్న

  • దాసోజు శ్రవణ్‌ను ఎందుకు నామినేట్ చేయలేదని ప్రశ్న
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేగాల మీద ఆమోదమని విమర్శ
  • సర్పంచ్‌ల పదవీ కాలం పొడిగించాలని సూచన
  • బండి సంజయ్ నోటి నుంచి వచ్చిన మాటనే రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిందని వ్యాఖ్య

ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంను ప్రస్తుత ప్రభుత్వం నామినేట్ చేస్తే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎలా ఆమోదించారు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న తమిళిసై ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఈ రాష్ట్రమంతా చూస్తోందన్నారు. నాలుగు నెలల క్రితం నాటి కేసీఆర్ కేబినెట్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కింద దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను నామినేట్ చేస్తే గవర్నర్ తిరస్కరించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కోదండరాం, అమిర్ అలీఖాన్ పేర్లకు ఆమోదం తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు.

రాజకీయ సంబంధాలు ఉన్నాయనే కారణంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణల పేర్లను తిరస్కరించిన గవర్నర్… ఈ రోజు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంకు ఎలా ఆమోదం తెలిపారో చెప్పాలన్నారు. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నామినేట్ చేస్తే ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. నాడు శ్రవణ్‌ను ఎందుకు ఆమోదించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడారని, సత్యనారాయణ సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. అందుకే తాము వారిని నామినేట్ చేసినట్లు చెప్పారు.

లెటర్ రాగానే ఆగమేగాల మీద ఆమోదం

ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేగాల మీద ఎలా సంతకం చేశారో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాంను ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పని చేస్తున్నారని… రాజ్‌భవన్ నడుస్తోందనే విషయాన్ని గుర్తించాలన్నారు. గవర్నర్… సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యులు కాదని, రాష్ట్ర ప్రజలకు బాధ్యులనే విషయం గుర్తెరగాలన్నారు. నాడు కనిపించిన రాజకీయ నేపథ్యానికి ఉన్న అభ్యంతరాలు నేడు ఎందుకు కనిపించడం లేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు నిర్ణయం తీసుకున్నారా? అనే నిలదీశారు. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కును తెలియజేస్తుందని విమర్శించారు

సర్పంచుల పదవీకాలం పొడిగించాలి

సర్పంచుల పదవీకాలం పొడిగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజల తరఫున ఎన్నికైన సర్పంచుల పదవీకాలం పొడిగించాలి.. కానీ ప్రత్యేక ఇంఛార్జ్‌లను పెట్టవద్దన్నారు. ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాలన చేయాలి కానీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఇంఛార్జ్‌లు కాదన్నారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు సర్పంచుల పరిపాలన సమయం పోయిందని, కాబట్టి పదవీ కాలాన్ని ఆరు నెలలు లేదా సంవత్సరం మేర పొడిగించాలన్నారు. లేదంటే కనీసం ఎన్నికలు నిర్వహించే వరకు వారి కాలాన్ని పొడిగించాలని సూచించారు.

బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు

ఎంత మంచి పదవిలో కూర్చుండబెట్టినప్పటికీ నీచ మానవులు తమ బుద్ధి మార్చుకోలేరని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నట్లుగా ఉందన్నారు. ఇంకా మేమే అధికారంలో ఉన్నామనుకొని బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలన్నారు. ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు బీఆర్ఎస్ వెంట పడుతుందన్నారు. ప్రతి అంశంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు ప్రజలందరికీ కనిపిస్తోందన్నారు. ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమని అర్థమవుతోందన్నారు. ఇటీవల బండి సంజయ్ కూడా కాంగ్రెస్, బీజేపీ కొట్లాడుకోవద్దు… బీఆర్ఎస్‌ను అంతం చేద్దామని పిలుపునిచ్చారని ఆరోపించారు. నిన్న గుంపు మేస్త్రి కూడా అదే మాట అన్నారన్నారు.

Related posts

వేములవాడలో బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో మండిపడిన రేవంత్ రెడ్డి!

Ram Narayana

కామారెడ్డిలో పోటీచేయడానికి ఓలెక్క ఉందన్న కేసీఆర్ …

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి…కిషన్ రెడ్డి

Ram Narayana

Leave a Comment