- పుంజుకుంటున్న దేశీయ విమానయానరంగం
- ఆదివారం సరికొత్త రికార్డు నమోదు
- బద్దలైన గత రికార్డులు
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా సమయంలో ప్రయాణికుల సంఖ్య పడిపోయి విమానయానరంగం కునారిల్లింది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకుంది. దేశీయ విమానయానరంగంలో ఆదివారం సరికొత్త రికార్డు నమోదైంది. ఆ రోజు ఏకంగా 4,71,751 మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. ఒక రోజులో ఇంతమంది విమానాల్లో ప్రయాణించడం ఇదే తొలిసారని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. వీరిని 6,128 విమానాల్లో వివిధ గమ్యస్థానాలకు చేర్చినట్టు పేర్కొంది.
కరోనాకు ముందు ఒక రోజు ప్రయాణికుల సగటు 3,98,579 కాగా, ఇప్పుడు అందుకు 14 శాతం మంది అధికంగా ప్రయాణించారు. నిరుడు ఏప్రిల్ 21న 5,899 విమానాల్లో 4,28,389 మంది ప్రయాణించారు. ఇప్పుడు అంతకుమించి ప్రయాణించారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో విమాన ప్రయాణికుల సంఖ్య గతేడాది ఇదే కాలంలో పోల్చితే 375.04 లక్షల నుంచి 391.46 లక్షలకు పెరిగినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.