- వివేక్ నగర్‌లోని న్యూబార్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో శనివారం ప్రమాదం
- ఆరుగురు చిన్నారుల మృతి, మరో ఆరుగురికి ఆసుపత్రిలో చికిత్స
- ఆసుపత్రితో పాటు పక్కనే ఉన్న రెసిడెన్షియల్ భవనంలో కూడా మంటలు
ఢిల్లీలోని ఓ చిన్నారుల ఆసుపత్రిలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 7గురు నవజాత శిశువులు మృతిచెందారు. వివేక్ నగర్ లోని న్యూబార్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. మొత్తం 12 మంది చిన్నారులను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొచ్చామని ఢిల్లీ ఫైర్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. అయితే, వీరిలో ఆరుగురు మరణించగా మిగతా వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరికి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నారు. చిన్నారులకు ఈస్ట్ ఢిల్లీ అడ్వాన్స్ ఎన్ఐసీయూ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.
శనివారం రాత్రి 11.32 గంటలకు ఫైర్ కంట్రోల్ రూంకు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం గురించి తెలిసిందని పోలీసులు తెలిపారు. మొత్తం 16 ఫైర్ స్టేషన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రి భవనంతో పాటూ ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ లోని రెండు ఫ్లోర్లలో మంటలు రేగినట్టు చెప్పారు. ఇటీవల గుజరాత్ లోని రాజ్‌కోట్ నగరంలోని గేమ్ జోన్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఏకంగా 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.