- టెల్ అవీవ్ లక్ష్యంగా 14 రాకెట్లు గురిపెట్టిన హమాస్
- నగరంలో అత్యవసర అలారం మోగించిన ఇజ్రాయెల్ సైన్యం
- ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి ప్రకటనా చేయని ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ లక్ష్యంగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మరోసారి దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా ఆదివారం ఏకంగా 14 రాకెట్లను గురిపెట్టింది. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని రఫా నగరం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్టు ‘జెరూసలేం పోస్ట్’ కథనం పేర్కొంది. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ ఇప్పటివరకు స్పందించలేదు. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలపలేదు. అయితే రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం టెల్ అవీవ్ నగరంలో సైరన్‌లు మోగించిందని, మరిన్ని రాకెట్లు దూసుకురావొచ్చంటూ హెచ్చరించిందని ‘జెరూసలేం పోస్ట్’ కథనం పేర్కొంది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ లక్ష్యంగా హమాస్ జరిపిన అతిపెద్ద క్షిపణి దాడులు ఇవేనని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
కాగా అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. దాదాపు 1,200 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారు. దాదాపు 250 మందిని బందీలుగా మార్చుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగిన విషయం తెలిసిందే. హమాస్‌ను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా కొన్ని నెలలుగా పాలస్తీనాలోని గాజాలో భీకర దాడులు జరుపుతోంది. దాడుల విరమణ కోసం జరుగుతున్న చర్చలు సఫలం కావడం లేదు