- ఐపీఎల్ ఫైనల్‌లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్
- జీర్ణించుకోలేకపోయిన కావ్యా మారన్
- కెమెరాల కంటపడకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు
ఈసారి ఎన్నడూ లేని దూకుడు ప్రదర్శించి ఫైనల్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తుది మెట్టుపై బోల్తా పడడాన్ని ఆ జట్టు యజమాని కావ్యా మారన్ జీర్ణించుకోలేకపోయారు. పొంగుకొస్తున్న కన్నీటిని దాచుకోలేకపోయారు. కెమెరాల కంటబడకుండా వెనక్కి తిరిగి ఏడ్చేశారు. కన్నీటిని తుడుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాధను అదిమి పెడుతూనే విజేత జట్టుకు చప్పట్లతో అభినందనలు తెలిపారు.
కావ్య బాధను నెటిజన్లు కూడా పంచుకున్నారు. క్రికెట్‌పై అత్యంత మక్కువ కలిగిన ఫ్రాంచైజీ ఓనర్ ఆమె ఒక్కరేనని ప్రశంసించారు. కావ్య ప్రతి మ్యాచ్‌కు వచ్చి ఆటగాళ్లకు మద్దతుగా నిలిచిందని, జట్టు ఓడినా విజేత జట్టును అభినందించి టీమ్ స్పిరిట్ చూపిందని పలువురు అభినందించారు. గత సీజన్‌లో జాబితాలో అట్టడుగున ఉన్న హైదరాబాద్ ఈసారి రన్నరప్‌గా నిలిచినందుకు సంతోషపడాలని మరికొందరు సూచించారు.