- నేడు కేంద్ర బడ్జెట్ ప్రకటించిన నిర్మలా సీతారామన్
- ఏపీకి గణనీయంగా కేటాయింపులు చేసిన కేంద్రం
- హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
కేంద్ర బడ్జెట్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏపీ అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని వెల్లడించారు.
ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక రంగం, ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం హర్షణీయం అని పేర్కొన్నారు.
ఏపీ పునర్ నిర్మాణం దిశగా కేంద్రం అందిస్తున్న ఈ సహకారం ఎంతగానో ఉపకరిస్తుందని చంద్రబాబు వివరించారు. ఎంతో భరోసా అందించేలా ఉన్న ఇటువంటి ప్రగతిశీల బడ్జెట్ ను సమర్పించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.
ఏపీకి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు…
- ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక సాయం
- అవసరమైతే వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధుల కేటాయింపు
- పోలవరం ప్రాజెక్టుకు సహాయ సహకారాలు
- ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ
- పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందించే విద్యుత్, రైల్వే, నీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు
- విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా రాయలసీమ, కోస్తాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్ లు
- విశాఖ-చెన్నై కారిడార్ లో కొప్పర్తికి ప్రాధాన్యం