- వయనాడ్ కొండచరియలు విరిగిన ఘటనలో 50కి పెరిగిన మృతులు
- తమను కాపాడాలంటూ శిథిలాల కింది నుంచి ఆత్మీయులకు ఫోన్
- వందలాదిమందిని కాపాడిన ఆర్మీ
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిన ఘటనలో మృతుల సంఖ్య 50కి పెరిగింది. ఇందులో చిన్నారులు, మహిళలు ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల కింది నుంచే వారు తమ ఆత్మీయులకు ఫోన్ చేసి తమను కాపాడాలంటూ విలపించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఫోన్ సంభాషణలు మీడియాలో వస్తున్నాయి.
తాను ఇంట్లో ఉండగా ఘటన జరిగిందని, శిథిలాల్లో చిక్కుకుపోయానని, తనను కాపాడాలని చురల్మల ప్రాంతంలో ఓ మహిళ ఫోన్ చేసి వేడుకుంటున్నట్లుగా ఆడియో వైరల్ అయింది. ఎవరైనా వచ్చి సాయం చేయమని ఆమె ఏడుస్తూ వేడుకున్నారు.
కొండచరియలు విరిగిన సమయంలో ఆ ప్రాంతమంతా కంపించిందని, దీంతో ఎక్కడకు వెళ్లాలో అర్థం కాలేదని స్థానికులు చెబుతున్నారు. ముండై ప్రాంతంలో ప్రజలు బురదలో కూరుకుపోయారు. తాము బురదలో చిక్కుకుపోయామని ఓ బాధితుడు తమకు ఫోన్ చేసినట్లు ఓ వ్యక్తి తెలిపారు. వీడియో కాల్ చేసి కూడా పలువురు కాపాడమని అర్థిస్తున్నట్లుగా చెబుతున్నారు.
కాగా, వయనాడ్‌లో రంగంలోకి దిగిన ఆర్మీ వందలాది మందిని కాపాడింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వయనాడ్ ఘటన బాధితులకు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.