- ఫిన్లాండ్ కు చెందిన ఆల్టో వర్సిటీ పరిశోధకుల అధ్యయనం
- ఆరు రకాల ప్రేమలపై ఎఫ్ఎంఆర్ఐ టెక్నాలజీతో పరిశోధన
- సెరెబ్రల్ కార్టెక్స్ జర్నల్ లో వివరాలు ప్రచురణ
ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక సార్వజనీనమైన భావన. ప్రియురాలిపై ప్రేమ, కుటుంబ సభ్యులపై ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, పెంపుడు జంతువులపై ప్రేమ, ప్రకృతి అంటే ప్రేమ… ఇలా ప్రేమ రకరకాలుగా ఉంటుంది.
తాజాగా, ఫిన్లాండ్ కు చెందిన ఆల్టో యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం ప్రేమ గురించి కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. విభిన్న రకాల ప్రేమలు మెదడులోని వేర్వేరు ప్రాంతాలను కాంతివంతం చేస్తాయట. ఉదాహరణకు ప్రియురాలిపై ప్రేమ మెదడులోని ఒక భాగాన్ని ప్రకాశవంతం చేస్తే… తల్లిదండ్రుల ప్రేమ మెదడులోని మరో ప్రాంతాన్ని వెలిగిస్తుందట.
ఆల్టో వర్సిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధన కోసం ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్ఎంఆర్ఐ) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఆరు రకాల ప్రేమల గురించి మెదడు ఆలోచిస్తున్నప్పుడు… మెదడులోని ఆరు వేర్వేరు ప్రాంతాలు కాంతివంతం అయినట్టు గుర్తించారు.
సమాజంలోకి వెళ్లినప్పుడు వివిధ పరిస్థితుల్లో ప్రేమ భావనలు ఉత్పన్నమైనప్పుడు మెదడులోని బేసల్ గాంగ్లియా, నుదుటి మధ్యన ఉండే విభజన రేఖ, ప్రిక్యూనియస్, తల వెనుక భాగంలో ఉండే టెంపోరోపారిటల్ జంక్షన్ లలో క్రియాశీలత ఏర్పడుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన పార్టీలీ రినే వెల్లడించారు.
ఇక, తల్లిదండ్రుల ప్రేమలో మెదడులో బాగా లోపల ఉండే స్ట్రియాటమ్ లో క్రియాశీలత కలుగుతుందని, ఈ తరహా ప్రతిస్పందన మరే ఇతర రకాల ప్రేమల్లోనూ కనిపించదని రినే వివరించారు. కొత్త వ్యక్తులపై కలిగే ప్రేమ… అయినవాళ్లు, సన్నిహితులపై కలిగే ప్రేమతో పోల్చితే మెదడులో తక్కువ చైతన్యం కలిగిస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.
కాగా, ఈ అధ్యయనం వివరాలను ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ కు చెందిన సెరెబ్రల్ కార్టెక్స్ జర్నల్ లో ప్రచురించారు.