Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సుప్రీం కోర్ట్ వార్తలు

రోడ్లపై ఉన్న ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు!

  • ప్రజల భద్రతే ముఖ్యమని తేల్చిచెప్పిన అత్యున్నత న్యాయస్థానం
  • బుల్డోజర్ జస్టిస్ పై దాఖలైన పిటిషన్ల విచారణలో కీలక వ్యాఖ్యలు
  • భారతదేశంలో అన్ని మతాలకూ సమాన ప్రాధాన్యం ఉంటుందని వెల్లడి 

ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురద్వారాలు.. ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రజల భద్రత విషయంలో రాజీ ధోరణి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదని వివరించింది. ఈమేరకు బుల్డోజర్ జస్టిస్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదీ కేసు…

ఏదైనా నేరానికి పాల్పడిన వ్యక్తుల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోందనే ఆరోపణలు ఇటీవల పెరిగాయి. అత్యాచారం, హత్య కేసులలో నిందితుల ఇంటిపైకి బుల్డోజర్లను పంపిస్తోందని పలు రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. 

నేరం జరిగిన ఒకటి రెండు రోజుల్లో పలు కారణాలు చూపిస్తూ నిందితుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇది ‘బుల్డోజర్ జస్టిస్’ అంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. దీనిని కోర్టులు ఆక్షేపించాయి. ఒకవేళ నిందితుడు నేరానికి పాల్పడినా సరే ఇంటిని కూల్చడం సరికాదని వ్యాఖ్యానించాయి. 

ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బుల్డోజర్ జస్టిస్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ విచారించారు.

రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఒకటీ రెండు సంఘటనల ఆధారంగా న్యాయస్థానం ఓ అంచనాకు రావద్దని కోరారు. ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి ముందుగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ కట్టడాలని తేల్చాక నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నట్లు వివరించారు. ఏదో ఒక ఘటననో, ఓ వర్గం వారి ఆరోపణలతోనో కూల్చివేతలు అక్రమమని భావించవద్దని కోరారు. 

దీనిపై స్పందించిన సుప్రీం బెంచ్… మనది లౌకిక దేశమని గుర్తుచేస్తూ మత విశ్వాసాలకన్నా ప్రజల భద్రతే ముఖ్యమని గతంలోనూ పలు తీర్పుల్లో స్పష్టం చేసినట్లు తెలిపింది. రోడ్లపై ఉన్న మతపరమైన కట్టడాలను తొలగింపును కోర్టు సమర్థించిందని గుర్తుచేసింది. నిందితుల ఇళ్ల కూల్చివేత విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, ఆక్రమణల తొలగింపు చట్టప్రకారమే జరగాలన్నదే ధర్మాసనం అభిప్రాయమని పేర్కొంది.

Related posts

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు…

Ram Narayana

ఆత్మహత్య అని ఎలా చెప్పారు?.. కోల్ కతా వైద్యురాలి హత్యాచారంపై సుప్రీంకోర్టు

Ram Narayana

అనిల్ అంబానీకి సుప్రీం కోర్టులో షాక్!

Ram Narayana

Leave a Comment