- ఈ ఒక్కరోజే ఏడు విమానాలకు బాంబు బెదిరింపు
- చికాగో, సింగపూర్‌కు వెళ్లే విమానాలకు కూడా బెదిరింపు
- సోషల్ మీడియా వేదికగా వచ్చిన బెదిరింపులు
దేశవ్యాప్తంగా పలు విమానాలకు ఈరోజు సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపుల నేపథ్యంలో పలు విమానాలను దారి మళ్లించగా, కొన్ని మార్గాల్లో రద్దయ్యాయి. ఈరోజు ఏకంగా ఏడు విమానాలకు ఎక్స్ వేదికగా బెదిరింపులు వచ్చాయి. ఇందులో విదేశాలకు వెళ్లే విమానాలు కూడా ఉన్నాయి. దీంతో పలు విమానాశ్రయాల్లో భద్రతా సంస్థలు… ఉగ్రవాద నిరోధక డ్రిల్స్ నిర్వహించాయి.
ఢిల్లీ – చికాగో, మదురై – సింగపూర్, జైపూర్ – బెంగళూరు సహా తదితర ఏడు విమానాలకు గంటల వ్యవధిలో బెదిరింపులు వచ్చాయి. బెదిరింపుల నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఫిర్యాదు చేసింది. బెదిరింపులకు కారణమైన ఎక్స్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు.
బాంబు బెదిరింపు కారణంగా కొన్ని విమానాలు ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యాయి. మరికొన్ని విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. బెదిరింపులు వచ్చిన ఆయా విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు విమానాల రాకపోకల్లో ఆలస్యం చోటు చేసుకుంది. మరికొన్ని విమానాల షెడ్యూల్ మారింది.